ర్యాలీగా వస్తున్న ప్రైవేటు కళాశాల విద్యార్థులు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: విభజన చట్టంలో పేర్కొ న్న విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాల్సిందేనని విద్యార్థులు గళం విప్పారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ మానవహారం చేపట్టారు. బుధవారం నగరంలోని కోటిరెడ్డి సర్కిల్‌లో విద్యార్థి ఐక్యవేదిక జేఏసీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో విద్యార్థులు కోటిమందితో మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ, జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, విశాఖ రైల్వేజోన్ దుగ్గరాజపట్నం ఓడరేవు వంటి ఏర్పాటు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చట్టంలో పొందు పరిచిందన్నారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సింది పోయి ఏ మా త్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రధా ని మోదీ 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపు ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఫీజుబిలిటీ లేదని సుప్రీం కోర్టులో అపిఢవిట్ దాఖలు చేయడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలోని బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రజలను మభ్య పెట్టేందుకు దొంగ పోరాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్ మాట్లాడుతూ విభజన హామీల కోసం విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే ముఖ్య మంత్రి చంద్రబాబు పోలీసులు చేత అక్రమ అరెస్ట్‌లు చేయించడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి యువభేరి నిర్వహిస్తే విద్యార్థులను భయబ్రాం తులకు గురి చేయడం దారుణమన్నారు. వైఎస్ ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా మాట్లాడుతూ విభజన హామీల కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ప్రజలతోపాటు, సినిమా హీరోలు మద్దతు తెలపాలన్నారు.
అనుమతి తీసుకొని 20 వేల మంది విద్యార్థులతో కలిసి మానవహారం చేస్తుంటే కనీసం 10 నిమిషాలు సమయం ఇవ్వకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అన్నారు. అపుస్మా జిల్లా అధ్యక్షుడు ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కరువుతో అల్లాడుతున్న జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి ఆదుకోవాల్సింది పో యి జిల్లాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. విభజన హామీలు అమలు చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు 5 మంది తమ పదవులకు రాజీనామా చేసి రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తుంటే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో డ్రామాలాడుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలి పారు.
ఉక్కు సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించి ఏపీలో పుట్టగతులు లేకుండా పోయిందో నేడు బీజేపీకి కూడా అదే గతి పడుతుందన్నారు. విద్యార్థి ఐక్య వేదిక జేఏసీ నాయకుల ప్రసంగాలను పోలీసులు అడ్డుకొని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యను, మద్దిలేటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జోగిరామిరెడ్డి, విద్యార్థి ఐక్య వేదిక జేఏసీ యూనియన్ నాయకులు వెంకట శివ, నరసింహ, సగిలి రాజేంద్ర ప్రసాద్, గంగిరెడ్డి, బి. మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment