
7, 8 తేదీల్లో మన్యంలో జగన్ పర్యటన
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ నెల 7, 8 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
- రాజానగరంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
- అనంతరం మన్యంలో బాధితులకు బాసట
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7, 8 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు రానున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు శనివారం విలేకరులకు తెలిపారు. 7న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని రాజానగరం నియోజకవర్గంలో దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని, అనంతరం రంపచోడవరం వెళ్లి అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై బాధితులతో మాట్లాడతారని చెప్పారు.
ఆ రోజు రాత్రి మారేడుమిల్లిలో బసచేసి ఎనిమిదో తేదీ ఉదయం చింతూరు మీదుగా రేఖవానిపాలెం వెళ్లి అక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. వారితో మాట్లాడాక జగన్ కాళ్లవాపు వ్యాధితో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను కలసి ఓదారుస్తారని కన్నబాబు చెప్పారు.