రోడ్డుపై పండ్లు విక్రయిస్తున్న చిరు వ్యాపారులు
కోవిడ్ కారణంగా వీధి వ్యాపారుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది..రెక్కాడితే గానీ డొక్కాడని వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా అండగా నిలిచింది. నగరంలో వివిధ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకుని జీవించే వారికి రుణాల మంజూరుకు వీఎంసీ ప్రణాళికలు రూపొందిస్తోంది.
పటమట(విజయవాడ తూర్పు): కరోనా నేపథ్యంలో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి సరైన వ్యాపారం లేదు. ఉన్న సరుకు అమ్ముడుపోక నష్టపోయారు. వారు తిరిగి వ్యాపారం చేసుకునేందుకు జగనన్న తోడు పథకం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. పట్టణ పేదరిక నిర్మూలన, వీఎంసీ పట్టణ సామాజికాభివృద్ధి విభాగం (యూసీడీ) సౌజన్యంతో ష్యూరిటీ లేని రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది. 2020 మార్చి నాటికి వీధి వ్యాపారులుగా గుర్తింపు పొందిన వారందరికీ సత్వర రుణాల మంజూరుకు ఇటీవలే బ్యాంకర్లతో కూడా వీఎంసీ అధికారులు సమావేశం నిర్వహించారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో 6,150 మంది వీధి వ్యాపారులుగా గుర్తింపు పొందగా 3వేల మంది గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే 6వేల మందికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.10 వేల రుణాన్ని సత్వరమే ఎలాంటి ష్యూరిటీ లేకుండా అందించాలని బ్యాంకర్లకు సూచించారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో వివిధ బ్యాంకులకు చెందిన 74 బ్రాంచీల ద్వారా రూ. 6.14 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటిలో అత్యధికంగా ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ. 2. 53 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1.62 కోట్లు రుణాల మంజూరుకు సిఫార్సు చేశారు.
అర్హులు ఎవరంటే..
♦ రోడ్డు వెంబడి పండ్లు, కూరగాయలు, పూలు, చిన్నపిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయదారులు
♦ దుస్తులు, మాస్కులు విక్రయదారులు
♦ హెల్మెట్లు, కొబ్బరిబొండాల వ్యాపారులు
♦ ఆహార పదార్ధాలు అమ్మే వ్యాపారాలు (ఫాస్ట్‌ఫుడ్, పానీపూరి, సమోసా లాంటివి), – ఫ్యాన్సీ వస్తువులు, పాన్, బీడీలు, పాలు, పాల ఉత్పత్తులు, టీ, కాఫీ అమ్మేవారు, కర్రీ పాయింట్స్, చేపలు, కోడిగుడ్లు, చికెన్, మటన్ విక్రయదారులు
♦ ఫ్రూట్ జ్యూస్, కూల్ డ్రింక్స్, స్టేషనరీ, సైకిల్ రిపేర్, మెకానిక్, సిలిండర్ రిపేరు,
♦ స్నాక్స్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులు, కాస్మోటిక్స్, సీజనల్ ఐటమ్స్ అమ్మేవారు(గొడుగులు, కళ్లజోళ్లు, స్వెట్టర్లు తదితరాలు)
♦ లెదర్ ఉత్పత్తులు (బూట్లు, బెల్టులు, పర్సులు, బ్యాగులు) సింతటిక్ బ్యాగ్‌లు, పోస్టర్లు, పొటోఫ్రేమ్‌లు,
♦ డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు, ఆహార ము డి పదార్థాలు, గింజలు, కుండలు
♦ పూజా సామగ్రి, ఇస్త్రీ, రోడ్ సైడ్ టైలరింగ్, ఓపెన్ బా ర్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కొవ్వొత్తులు తదితర విక్రయ దారులను వీధి వ్యాపారులుగా ప్రభుత్వం గుర్తించింది.
ఆదుకునేందుకే..
లాక్‌డౌన్ నేపథ్యంలో వీధి వ్యాపారాలు లేవు. దీంతో వీధి వ్యాపారుల కుటుంబ పోషణ భారంగా మారింది. వీధి వ్యాపారులు మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. దీనివల్ల వారి ఆర్థికస్థితిపై పెనుభారం పడుతుంది. ఇలాంటి పరిస్థితి నుంచి వారిని ఆదకునేందుకు ప్రభుత్వం జగన్నన్న తోడు పథకాన్ని ప్రారంభిస్తుంది. నగరంలో 6,150 మంది వీధి వ్యాపారులుగా రిజిస్టర్ చేసుకున్నారు. మరో 3వేల మంది రిజిస్ట్రేషన్‌కు ఎదురు చూస్తున్నారు. వీరందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. – డాక్టర్ శ్రీధర్, యూసీడీ పీఓ, వీఎంసీ
Comments
Please login to add a commentAdd a comment