Street merchant
-
‘జగనన్న తోడు’ ఒక్కో వ్యాపారికి 10 వేల రుణం
కోవిడ్ కారణంగా వీధి వ్యాపారుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది..రెక్కాడితే గానీ డొక్కాడని వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం జగనన్న తోడు పథకం ద్వారా అండగా నిలిచింది. నగరంలో వివిధ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకుని జీవించే వారికి రుణాల మంజూరుకు వీఎంసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. పటమట(విజయవాడ తూర్పు): కరోనా నేపథ్యంలో చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. లాక్డౌన్ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి సరైన వ్యాపారం లేదు. ఉన్న సరుకు అమ్ముడుపోక నష్టపోయారు. వారు తిరిగి వ్యాపారం చేసుకునేందుకు జగనన్న తోడు పథకం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. పట్టణ పేదరిక నిర్మూలన, వీఎంసీ పట్టణ సామాజికాభివృద్ధి విభాగం (యూసీడీ) సౌజన్యంతో ష్యూరిటీ లేని రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది. 2020 మార్చి నాటికి వీధి వ్యాపారులుగా గుర్తింపు పొందిన వారందరికీ సత్వర రుణాల మంజూరుకు ఇటీవలే బ్యాంకర్లతో కూడా వీఎంసీ అధికారులు సమావేశం నిర్వహించారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో 6,150 మంది వీధి వ్యాపారులుగా గుర్తింపు పొందగా 3వేల మంది గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే 6వేల మందికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ.10 వేల రుణాన్ని సత్వరమే ఎలాంటి ష్యూరిటీ లేకుండా అందించాలని బ్యాంకర్లకు సూచించారు. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో వివిధ బ్యాంకులకు చెందిన 74 బ్రాంచీల ద్వారా రూ. 6.14 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటిలో అత్యధికంగా ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ. 2. 53 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1.62 కోట్లు రుణాల మంజూరుకు సిఫార్సు చేశారు. అర్హులు ఎవరంటే.. ♦ రోడ్డు వెంబడి పండ్లు, కూరగాయలు, పూలు, చిన్నపిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయదారులు ♦ దుస్తులు, మాస్కులు విక్రయదారులు ♦ హెల్మెట్లు, కొబ్బరిబొండాల వ్యాపారులు ♦ ఆహార పదార్ధాలు అమ్మే వ్యాపారాలు (ఫాస్ట్‌ఫుడ్, పానీపూరి, సమోసా లాంటివి), – ఫ్యాన్సీ వస్తువులు, పాన్, బీడీలు, పాలు, పాల ఉత్పత్తులు, టీ, కాఫీ అమ్మేవారు, కర్రీ పాయింట్స్, చేపలు, కోడిగుడ్లు, చికెన్, మటన్ విక్రయదారులు ♦ ఫ్రూట్ జ్యూస్, కూల్ డ్రింక్స్, స్టేషనరీ, సైకిల్ రిపేర్, మెకానిక్, సిలిండర్ రిపేరు, ♦ స్నాక్స్, హ్యాండీక్రాఫ్ట్ ఉత్పత్తులు, కాస్మోటిక్స్, సీజనల్ ఐటమ్స్ అమ్మేవారు(గొడుగులు, కళ్లజోళ్లు, స్వెట్టర్లు తదితరాలు) ♦ లెదర్ ఉత్పత్తులు (బూట్లు, బెల్టులు, పర్సులు, బ్యాగులు) సింతటిక్ బ్యాగ్‌లు, పోస్టర్లు, పొటోఫ్రేమ్‌లు, ♦ డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు, ఆహార ము డి పదార్థాలు, గింజలు, కుండలు ♦ పూజా సామగ్రి, ఇస్త్రీ, రోడ్ సైడ్ టైలరింగ్, ఓపెన్ బా ర్బర్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కొవ్వొత్తులు తదితర విక్రయ దారులను వీధి వ్యాపారులుగా ప్రభుత్వం గుర్తించింది. ఆదుకునేందుకే.. లాక్డౌన్ నేపథ్యంలో వీధి వ్యాపారాలు లేవు. దీంతో వీధి వ్యాపారుల కుటుంబ పోషణ భారంగా మారింది. వీధి వ్యాపారులు మళ్లీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. దీనివల్ల వారి ఆర్థికస్థితిపై పెనుభారం పడుతుంది. ఇలాంటి పరిస్థితి నుంచి వారిని ఆదకునేందుకు ప్రభుత్వం జగన్నన్న తోడు పథకాన్ని ప్రారంభిస్తుంది. నగరంలో 6,150 మంది వీధి వ్యాపారులుగా రిజిస్టర్ చేసుకున్నారు. మరో 3వేల మంది రిజిస్ట్రేషన్‌కు ఎదురు చూస్తున్నారు. వీరందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. – డాక్టర్ శ్రీధర్, యూసీడీ పీఓ, వీఎంసీ -
బండిపై బతుకు..కదిలితేనే మెతుకు
ఉదయాన్నే మార్కెట్‌కు చేరుకోవడం..తోపుడు బండిపై రెడీమేడ్ దుస్తులు సర్దుకోవడం, ఆ బండివద్దే రాత్రి 10 గంటల వరకు నిలుచుని ఉండడం, రోజంతా కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురుచూడటం...నిప్పులు కురిసే ఎండైనా....నిలువునా తడిపే వానైనా పరిస్థితుల్లో మార్పు ఉండదు. జిల్లాలోని పలు ప్రధాన మార్కెట్లే కాక..రహదారుల పక్కన కూడా తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు వందలాది మంది ఉన్నారు. చిన్న మండల కేంద్రంలో కూడా 40నుంచి 50 మందికి పైగా ఉంటారు. సాక్షి, కడప : సీజన్లో వచ్చే రకరకాల పండ్లు, ఫ్యాన్సీ వస్తువులు తక్కువ ధరగల పిల్లల రెడీమేడ్ దుస్తులు ఇలా తోపుడు బండ్లపై పలు రకాల వ్యాపారాలు చేసే వారు వైవీ స్ట్రీట్‌లో కనిపిస్తుంటారు. ఆ బజారుకు వెళితే అడుగడుగునా మనకు ఇలాంటి బండ్లు తారస పడుతూనే ఉంటాయి. పెద్ద దుకాణదారుల అదిలింపులను దులిపేసుకుంటూ ప్రతిక్షణం కొనుగోలు దారుల కోసం చూస్తూ వచ్చిన వారు తప్పక కొనేలా చాకచక్యంగా మాట్లాడుతూ రూ. 100 వస్తువు రూ. 10లకు ఇవ్వాలని అడిగినా వదలకుండా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. రోజంతా వ్యాపారాలు చేసినా చివరకు వారికి మిగిలేది అంతంత మాత్రమే. కుటుంబం జరగడం, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు లేదా తక్కువ ఫీజులుగల ప్రైవేటు స్కూళ్లలో చేర్చుకోవడం, పెట్టుబడికి వడ్డీలకు తెచ్చి వ్యాపారాలు చేసుకోవడం..ఇదీ వారి జీవనశైలి. ఎండ, వాన లెక్కచేయరు. గోతం పట్టలు చుట్టుకున్న మంచినీళ్ల బాటిల్ తెచ్చుకుంటారు. మధ్యాహ్నం ఓ గంటపాటు బండిపై టార్పాలిన్ చుట్టి భోజనం చేసి వస్తారు. వచ్చిన ఆదాయం వడ్డీలకు, ఇంటి ఖర్చులకు మించి మిగిలేదంటూ ఉండదు. ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి ఖర్చు కోసం మళ్లీ అప్పులు, వడ్డీలు తప్పవు. అనారోగ్యాలు పీడిస్తే ఆకలి బాధలు పెరుగుతుంటాయి. మంచి ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు జేబులు అనుమతించవు. పిల్లలను పెద్ద చదువులు చదివించడానికి ఆర్థిక స్థోమత, ప్రోత్సాహం ఉండదు. పిల్లల భవిష్యత్తు పట్ల ప్రణాళిక ఉండదు. దాంతో వారి పిల్లలు కూడా హైస్కూలు స్థాయి దాటగానే ఇదే వ్యాపారానికి వచ్చేస్తుంటారు. ఒక బండికి సరిపడ దుస్తులు తెచ్చుకోవాలంటే కనీసం రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చవుతుంది. సీజన్లో అయితే వెంటనే దుస్తుల విక్రయాలు జరుగుతాయి. అన్ సీజన్లో చాలాసార్లు ఖాళీగా ఇంటికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. వర్షం వస్తే బండిని పక్కకు తీసేలోపే దుస్తులు తడిచి నష్టం కలుగుతుంది. ట్రాఫిక్‌కు అడ్డమని అప్పుడప్పుడు పోలీసుల మందలింపులు, పెద్దషాపుల యజమానుల చీదరింపులను పట్టించుకునే పరిస్థిని ఉండదు. ఏ దేవుడైనా కరుణించి పెట్టుబడి కోసం రుణం అందజేస్తే వారికి జీవితాంతం రుణపడి ఉంటామని వీరు పేర్కొంటున్నారు. జిల్లా వాసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గుండెల్లో ఏదో భరోసా, మన ఇంటిలో మనిషి గొప్పవాడైనంత సంతోష పడ్డామని పేర్కొంటున్నారు. మా పక్క వీధిలో ఉండే ఆపద్బాంధవుడు అంజద్‌బాషా మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగానూ ఉన్నతి చెందడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆయనగానీ, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖగానీ దయతలిచి పెట్టుబడికి రుణాలు ఇప్పించాలని, అందరూ పేదలకు ఇచ్చినట్లు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నారు. కష్టాల బండిలో... మా జీవితమంతా కష్టాల బండిలోనే సాగుతోంది. పాతికేళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నా. తిండి, ఇంటి బాడుగ, పిల్లల చదువులకే కష్టంగా ఉంది. పెట్టుబడుల కోసం ప్రభుత్వం సాయం చేస్తే నిలబడగలం. అమ్మ ఒడితో పిల్లల చదువుల ఖర్చు తప్పడం సంతోషంగా ఉంది. – ఎస్.రహీం, చిరు వ్యాపారి, కడప రుణం ఇస్తే సంతోషిస్తాం పెట్టుబడి కోసం సబ్సిడీపై రుణం ఇస్తే జీవితం కాస్త మెరగవుతోంది. మా కుటుంబాలన్నీ ఈ వ్యాపారాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వర్షాలు, అన్ సీజన్లతో తరచూ నష్టాలు తప్పడం లేదు. ఎండల్లో నిలబడి ఉండడంతో అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. మా కష్టాలపై పెద్దలు దృష్టి పెట్టాలి. – ఎస్.మహబూబ్‌బాషా, చిరు వ్యాపారి, కడప -
మానవత్వం మనిషి రూపులో..
60 ఏళ్లలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపిన మిథాలాల్ అహ్మదాబాద్: ఆయనేమీ ధనవంతుడు కాదు.. 15 ఏళ్ల వయసులో పొట్టకూటి కోసం పాకిస్తాన్‌నుంచి వలస వచ్చిన కాందిశీకుడు.. జీవన పోరాటంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరకు అహ్మదాబాద్ వీధుల్లో రిక్షాపై తిరుగుతూ ముత్యాల హారాలు అమ్మే వీధి వ్యాపారిగా స్థిరపడ్డాడు. అయితేనేం మూర్తీభవించిన మానవత్వానికి తాను ప్రతిరూపమని నిరూపించుకున్నాడు మిథాలాల్ సింధీ. నా అనేవారు ఎవరూ లేని అనాథ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇలా ఆరు దశాబ్దాల కాలంలో 550 అనాథ శవాలకు దహన సంస్కారాలు జరిపించాడు. ఫుట్‌పాత్‌పై తన సహచరుడు మరణించినప్పుడు దహన సంస్కారాలకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రారంభమైన ఈ సేవ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ‘ అనాథ శవం ఉందని సమాచారం రాగానే అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి శరీరంపై మతపరమైన ఆనవాల్లేమైనా ఉన్నాయేమో పరిశీలిస్తాను. ఏ మతస్తుడో తెలిస్తే ఆ మతపరమైన విధానంలో అంత్యక్రియలు నిర్వహిస్తాను’ అని మిథాలాల్ చెబుతున్నాడు. ఒక్కో శవం అంత్యక్రియలకూ మిథాలాల్‌కు కనీసం రూ. 15 వందలు ఖర్చవుతుంది. ముత్యాల హారాలు అమ్ముతూ సమకూర్చుకున్న మొత్తాన్నే అందుకు వినియోగిస్తుంటాడు. 83 ఏళ్ల మిథాలాల్ గత 60 ఏళ్లుగా ఫుట్‌పాత్‌పైనే జీవిస్తున్నాడు. తాను చేసే పనిలో పూర్తి సంతృప్తిగా ఉన్నానని, భగవంతుడు తనను ఇందుకోసమే పుట్టించాడని చెబుతూ ఉంటాడు.