బండిపై బతుకు..కదిలితేనే మెతుకు | Street Merchants Problems In Kadapa | Sakshi
Sakshi News home page

బండిపై బతుకు..కదిలితేనే మెతుకు

Published Sun, Jun 30 2019 8:04 AM | Last Updated on Sun, Jun 30 2019 8:05 AM

Street Merchants Problems In Kadapa - Sakshi

ఉదయాన్నే మార్కెట్‌కు చేరుకోవడం..తోపుడు బండిపై రెడీమేడ్‌ దుస్తులు సర్దుకోవడం, ఆ బండివద్దే రాత్రి 10 గంటల వరకు నిలుచుని ఉండడం, రోజంతా కొనుగోలుదారుల కోసం ఆశగా ఎదురుచూడటం...నిప్పులు కురిసే ఎండైనా....నిలువునా తడిపే వానైనా పరిస్థితుల్లో మార్పు ఉండదు. జిల్లాలోని పలు ప్రధాన మార్కెట్లే కాక..రహదారుల పక్కన కూడా తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు వందలాది మంది ఉన్నారు. చిన్న మండల కేంద్రంలో కూడా 40నుంచి 50 మందికి పైగా ఉంటారు. 

సాక్షి, కడప : సీజన్‌లో వచ్చే రకరకాల పండ్లు, ఫ్యాన్సీ వస్తువులు తక్కువ ధరగల పిల్లల రెడీమేడ్‌ దుస్తులు ఇలా తోపుడు బండ్లపై పలు రకాల వ్యాపారాలు చేసే వారు వైవీ స్ట్రీట్‌లో కనిపిస్తుంటారు. ఆ బజారుకు వెళితే అడుగడుగునా మనకు ఇలాంటి బండ్లు తారస పడుతూనే ఉంటాయి. పెద్ద దుకాణదారుల అదిలింపులను దులిపేసుకుంటూ ప్రతిక్షణం కొనుగోలు దారుల కోసం చూస్తూ వచ్చిన వారు తప్పక కొనేలా చాకచక్యంగా మాట్లాడుతూ రూ. 100 వస్తువు రూ. 10లకు ఇవ్వాలని అడిగినా వదలకుండా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు.

రోజంతా వ్యాపారాలు చేసినా చివరకు వారికి మిగిలేది అంతంత మాత్రమే. కుటుంబం జరగడం, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు లేదా తక్కువ ఫీజులుగల ప్రైవేటు స్కూళ్లలో చేర్చుకోవడం, పెట్టుబడికి వడ్డీలకు తెచ్చి వ్యాపారాలు చేసుకోవడం..ఇదీ వారి జీవనశైలి. ఎండ, వాన లెక్కచేయరు. గోతం పట్టలు చుట్టుకున్న మంచినీళ్ల బాటిల్‌ తెచ్చుకుంటారు. మధ్యాహ్నం ఓ గంటపాటు బండిపై టార్పాలిన్‌ చుట్టి భోజనం చేసి వస్తారు. వచ్చిన ఆదాయం వడ్డీలకు, ఇంటి ఖర్చులకు మించి మిగిలేదంటూ ఉండదు. ఆడపిల్లలు ఉంటే వారి పెళ్లి ఖర్చు కోసం మళ్లీ అప్పులు, వడ్డీలు తప్పవు. అనారోగ్యాలు పీడిస్తే ఆకలి బాధలు పెరుగుతుంటాయి. మంచి ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు జేబులు అనుమతించవు. పిల్లలను పెద్ద చదువులు చదివించడానికి ఆర్థిక స్థోమత, ప్రోత్సాహం ఉండదు.

పిల్లల భవిష్యత్తు పట్ల ప్రణాళిక ఉండదు. దాంతో వారి పిల్లలు కూడా హైస్కూలు స్థాయి దాటగానే ఇదే వ్యాపారానికి వచ్చేస్తుంటారు. ఒక బండికి సరిపడ దుస్తులు తెచ్చుకోవాలంటే కనీసం రూ. 50 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చవుతుంది. సీజన్‌లో అయితే వెంటనే దుస్తుల విక్రయాలు జరుగుతాయి. అన్‌ సీజన్‌లో చాలాసార్లు ఖాళీగా ఇంటికి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. వర్షం వస్తే బండిని పక్కకు తీసేలోపే దుస్తులు తడిచి నష్టం కలుగుతుంది. ట్రాఫిక్‌కు అడ్డమని అప్పుడప్పుడు పోలీసుల మందలింపులు, పెద్దషాపుల యజమానుల చీదరింపులను పట్టించుకునే పరిస్థిని ఉండదు.

ఏ దేవుడైనా కరుణించి పెట్టుబడి కోసం రుణం అందజేస్తే వారికి జీవితాంతం రుణపడి ఉంటామని వీరు పేర్కొంటున్నారు. జిల్లా వాసి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే గుండెల్లో ఏదో భరోసా, మన ఇంటిలో మనిషి గొప్పవాడైనంత సంతోష పడ్డామని పేర్కొంటున్నారు. మా పక్క వీధిలో ఉండే ఆపద్బాంధవుడు అంజద్‌బాషా మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగానూ ఉన్నతి చెందడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆయనగానీ, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖగానీ దయతలిచి పెట్టుబడికి రుణాలు ఇప్పించాలని, అందరూ పేదలకు ఇచ్చినట్లు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నారు.

కష్టాల బండిలో...
మా జీవితమంతా కష్టాల బండిలోనే సాగుతోంది. పాతికేళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నా. తిండి, ఇంటి బాడుగ, పిల్లల చదువులకే కష్టంగా ఉంది. పెట్టుబడుల కోసం ప్రభుత్వం సాయం చేస్తే నిలబడగలం. అమ్మ ఒడితో పిల్లల చదువుల ఖర్చు తప్పడం సంతోషంగా ఉంది.
– ఎస్‌.రహీం, చిరు వ్యాపారి, కడప

రుణం ఇస్తే సంతోషిస్తాం
పెట్టుబడి కోసం సబ్సిడీపై రుణం ఇస్తే జీవితం కాస్త మెరగవుతోంది. మా కుటుంబాలన్నీ ఈ వ్యాపారాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. వర్షాలు, అన్‌ సీజన్‌లతో తరచూ నష్టాలు తప్పడం లేదు. ఎండల్లో నిలబడి ఉండడంతో అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. మా కష్టాలపై పెద్దలు దృష్టి పెట్టాలి.
 – ఎస్‌.మహబూబ్‌బాషా, చిరు వ్యాపారి, కడప 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement