జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ రాత పరీక్షను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తెలిపింది.
ఏప్రిల్ 6న రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ రాత పరీక్షను ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) తెలిపింది. విద్యార్థులు జేఈఈ మెయిన్ వెబ్‌సైట్ (www.jeemain.nic.in) నుంచి హాల్‌టికెట్లు(అడ్మిట్ కార్డు) డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 150 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. ఇక ఆన్‌లైన్ పరీక్షను ఏప్రిల్ 9, 11, 12, 19వ తేదీల్లో 281 పట్టణాల్లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురైతే సీబీఎస్‌ఈ హెల్ప్‌లైన్ కేంద్రాన్ని 8506061072, 8506061073, 8506061075, 8506061076, 8506061077 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
అభ్యర్థులకు హాల్‌టికెట్లను పంపించడంలేదని, వెబ్‌సైట్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అర్హతలకు సంబంధించిన వివరాలు, పత్రాలను పరీక్ష రోజున ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లోని అంశాలను సమపాళ్లలో తీసుకొని నిపుణులు ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందించారని వివరించింది. తేలిక, మధ్యస్తం, క్లిష్ట పద్ధతిలో వీటిని రూపొందించినట్లు వెల్లడించింది. గత ఏడాదిలాగే ఈసారి కూడా ప్రశ్నపత్రాలను రూపొందించినట్లు తెలిపింది.
నేడు ‘గేట్’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించిన గేట్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్టు ఐఐటీ ఖరగ్‌పూర్ గురువారం తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నెల 2 వరకు గేట్ ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించింది. ఫలితాలను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు వెబ్‌సైట్లో పేర్కొంది.
వెబ్‌లో.. ‘అబ్జర్వర్స్’ జాబితా
సాక్షి, హైదరాబాద్: ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ విభాగంలో అబ్జర్వర్స్(ఇంజినీరింగ్) పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు జాబితాలను చూసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేసింది.
టెన్త్ సోషల్ స్టడీస్ పేపర్-2 పరీక్ష వాయిదా?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 11న నిర్వహించడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. అదే రోజున పదో తరగతి సోషల్ స్టడీస్ పేపర్-2 నిర్వహణ మీద విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,658 కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఒకవైపు ఎన్నికలు జరుగుతుండగా పరీక్ష నిర్వహించడం సాధ్యమయ్యే పనికాదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 11న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసి, 16న నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. పరీక్ష వాయిదా గురించి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల సంఘం నుంచి ఉత్తర్వులు రాతపూర్వకంగా అందిన తర్వాతే... పరీక్ష వాయిదా గురించి చర్చిస్తామని అధికారులు చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల సాధ్యాసాధ్యాల గురించి చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 12న ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్ష మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, 15న వొకేషనల్ కోర్సు థియరీ పరీక్ష ఉన్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న ఆదివారం, 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.
టెన్త్ పరీక్షల తొలి రోజు 98.9 శాతం విద్యార్థులు హాజరు
పదో తరగతి పరీక్షల తొలి రోజు 98.9 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న 50 మంది విద్యార్థులను గుర్తించామని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో గరిష్టంగా 19 మందిని పట్టుకున్నామని చెప్పారు.