సుదర్శన చక్రం
- జేఎన్‌టీయూ(ఏ)లో రూ.74.32 కోట్ల పనులకు టెండర్లు లేకుండానే అప్పగించేందుకు యత్నం
- ఈ ప్రొక్యూర్‌మెంట్ కాకుండా సీల్డ్‌కవర్ల విధానం
- ప్రకటనలు ఇవ్వకుండా కేవలం వెబ్‌సైట్లో వివరాల వెల్లడి
- 15 రోజుల్లో నూతన వీసీ రానుండడంతో హడావుడి నిర్ణయాలు
- ఇన్‌చార్జ్ వీసీ తీరుపై సర్వత్రా విమర్శలు
యూనివర్సిటీ : జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ-అనంతపురం)లో యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రూ.74.32 కోట్లతో వర్సిటీ పరిధిలో చేపట్టనున్న పలు భవన నిర్మాణాలకు ఎలాంటి టెండర్లు లేకుండానే కొటేషన్ల ద్వారా పనులు కట్టబెట్టేందుకు నిర్ణయించడం వివాదాస్పదమవుతోంది. ఈ నెల 15లోపు జేఎన్‌టీయూకు నూతన వైస్ ఛాన్సలర్‌ను నియమిస్తామని స్వయాన మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
అయితే...ఈలోపే ఇన్‌చార్జ్ వీసీ ఆచార్య హెచ్.సుదర్శనరావు హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటుండడం విమర్శలకు తావిస్తోంది. ఇన్‌చార్జ్ వీసీ అయినప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకుంటుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వర్సిటీ నిబంధనల ప్రకారం ఇన్‌చార్జ్ వీసీ రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలి. అత్యవసరమైతే తప్ప కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అయినప్పటికీ నిబంధనలకు విరుదంగా రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తయ్యే భవన నిర్మాణాలకు అంకురార్పరణ చేస్తుండడం గమనార్హం.
చట్టంలోని లొసుగులే వెసులుబాటుగా..
రాష్ట్రవ్యాప్తంగా 15 యూనివర్సిటీలలో భవన, రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన పనులను ప్రభుత్వ ఏజెన్సీ, అనుబంధ సంస్థలు లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థలకు అప్పగించాలని గత నెల 12న ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమత్రా దావ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జీవో వర్సిటీకి చేరిందో..లేదో ఇంతలోనే గత నెల 20న జేఎన్‌టీయూ అధికారిక వెబ్‌సైట్లో కొటేషన్లను ఆహ్వానించారు. ఇంటిగ్రేటెడ్ లెక్చరర్ హాల్ కాంప్లెక్స్ 13,500 చదరపు అడుగులు , నూతన పరిపాలన భవనం 9000 చదరపు అడుగులు, ఓటీఆర్‌ఐలో ఫార్మసీ బ్లాక్ 5000 చదరపు అడుగులు, జిమ్ అండ్ యోగా హాలు 240 చదరపు అడుగులు, పులివెందులలో బాలుర హాస్టల్ 4900 చదరపు అడుగుల మేర నిర్మించడానికి కొటేషన్లు కోరారు. ఇవన్నీ రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.
ఆసక్తి గల ప్రభుత్వ ఏజెన్సీలు షీల్డ్ కవర్ ద్వారా అందజేయాలని, తక్కువ మొత్తానికి కోట్ చేసే వారికి పనులను గంపగుత్తగా అప్పగిస్తామని తెలిపారు. ఈ- ప్రొక్యూర్‌మెంట్ విధానం ద్వారా కాకుండా ఆఫ్‌లైన్‌లో కొటేషన్లు అందచేయాలని కోరడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాటికి సంబంధించిన బాక్స్‌లను వర్సిటీలో ఏర్పాటు చేయలేదు. దీంతో అక్రమాలు జరిగే అవకాశాలు ఉండవచ్చుననే ప్రచారం సాగుతోంది. అందులోనూ పత్రికలకు ప్రకటనలు ఇవ్వకుండా కేవలం వెబ్‌సైట్ ద్వారా కొటేషన్లు ఆహ్వానించడం వల్ల అన్ని ఏజెన్సీలకు తెలిసే అవకాశం ఉండకపోవచ్చు.
రెండేళ్లుగా పెండింగ్ ఉన్న పనులకు సైతం..
వెబ్‌సైట్లో కొటేషన్లు ఆహ్వానించడానికి వర్సిటీ అత్యుత్తమ పాలకవర్గమైన మానిటరింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ అనుమతి తప్పనిసరి. ఇదేమీ లేకుండానే కేవలం వీసీ ప్రొసీడింగ్స్ ప్రకారం కొటేషన్లు ఆహ్వానిస్తున్నామని వెబ్‌సైట్లో పేర్కొన్నారు. ఆచార్య లాల్‌కిశోర్ వీసీగా ఉన్నప్పుడు భవన నిర్మాణాలు చేపట్టాలని తలచినప్పటికీ బిల్డింగ్ కమిటీ నిర్ధారించిన విధానాలు లేకపోవడంతో ఆలస్యమైంది. దీనివల్ల రెండేళ్ల నుంచి నిర్మాణాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. వీటిని ఇన్‌చార్జ్ వీసీ టెండర్లు లేకుండానే కొటేషన్ల ద్వారా అప్పగించేందుకు సమాయత్తం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.