
మోడీతో వెళితే కాలిపోతావ్
* చంద్రబాబు రాజకీయాలపై నారాయణ వ్యాఖ్య
తిరుపతి, న్యూస్‌లైన్: బీజేపీతో దోస్తీ చేస్తే టీడీపీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. దీపాన్ని చూసి భ్రమపడి శలభం వెళితే ఏం జరుగుతుందో...మోడీకి ఆకర్షితుడైతే చంద్రబాబుకూ అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
సీమాంధ్ర సమస్యలపై ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి దీక్ష చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సమైక్యరాష్ట్రంలో సమస్యలు లేవా ? గత మూడేళ్లలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమస్యలు కనపడలేదా ? అని నారాయణ ప్రశ్నించారు. ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు.
ప్రత్యేక తెలంగాణకు సీపీఐ మద్దతిస్తున్నా.. రాయలసీమ సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, పార్లమెంట్‌లో కాంగ్రెస్ వాళ్లే బిల్లును అడ్డుకునే అవకాశం ఉందంటూ ఆ పార్టీపై బీజేపీ నెపం మోపి చేతులెత్తేసే పరి స్థితి కనిపిస్తోందని నారాయణ విమర్శించారు.