
‘కార్పొరేషన్’ తీర్పు... 24 గంటలే
♦ గెలుపు ఓటములపై ఎవరి ధీమా వారిది
♦ కూడికలు, తీసివేతల్లో అభ్యర్థులు
కాకినాడ : ఈవీఎంలలో నిక్షిప్తమైన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఓటర్ల తీర్పు మరో 24 గంటల్లో బయటకు రానుంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో సెప్టెంబర్ 1వ తేదీన జరిగే కౌంటింగ్‌పైనే అందరి దృష్టి పడింది. 48 డివిజన్లకు సంబంధించి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ సరళి ఆధారంగా అభ్యర్థులు గెలుపు ఓటములపై కూడికలు, తీసివేతల్లో పడ్డారు. ఏ డివిజన్లలో ఎంత శాతం పోలైంది? ఆ డివిజన్లలో ఏ వర్గం ప్రతిస్పందన ఏమిటి? ఓటర్ నాడి ఎలా ఉంది? వంటి అంశాలపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఉన్న అనుచరులు, ఇతర సిబ్బందిని కూడా ప్రజాస్పందనపై ఆరా తీయడంలో మునిగిపోయారు. ఓటింగ్ సరళి ఆధారంగా ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది? ఎక్కడ ప్రతికూలంగా ఉంటుంది? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు.
ఎవరి ధీమా వారిది...
గెలుపుపై అభ్యర్థులు ధీమాగా కనిపిస్తున్నారు. పోలింగ్ సరళిని బట్టి తమకే అవకాశాలున్నాయంటే ... తమదే విజయమంటూ ప్రధాన రాజకీయ పక్షాలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళి కూడా తమకే అనుకూలంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు.
ఇంటెలిజెన్స్ నివేదికపై ఆరా...
కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంటెలిజెన్స్ నివేదికపై అభ్యర్థులు ఆరా తీస్తున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఇప్పటికే ఓ రిపోర్టును ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ డివిజన్ ఏ పార్టీ ఖాతాలో వేశారనే అంశంపై అభ్యర్థులు ఆసక్తితో సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.
ఓటరు తీర్పు ఎటువైపు?
కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటరు ఎటువైపు మొగ్గారనే అంశంపై ఆసక్తి నెలకొంది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ, అధికార దుర్వినియోగం, ఓటర్లకు బెదిరింపులు, ప్రలోభాల నేపథ్యంలో వీరి నిర్ణయం ఎలా ఉంటుందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని డివిజన్లలో చివరి మూడు రోజులుగా డబ్బుతోపాటు కానుకలు కూడా పంపిణీ చేశారు. ఏది ఏమైనా మరో 24 గంటల్లో రానున్న ఓటరు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.