
కాబోయే సీఎం 'కన్నా'నా?
హైదరాబాద్ : వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. ఆయన శనివారం గవర్నర్ నరసింహన్తో సమావేశం అయ్యారు. పావుగంట పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. గవర్నర్‌తో కన్నా భేటీ... పలు ఊహాగానాలకు తావిస్తోంది.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానంపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ధిక్కార స్వరం వినిసిస్తున్న నేపథ్యంలో గవర్నర్, కన్నా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వారం రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణను కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఢిల్లీ పిలిపించుకుని చర్చించడం, ఇప్పుడు గవర్నర్ నరసింహన్తో భేటీ కావడం రాజకీయ చర్చకు దారితీసింది. కిరణ్ స్థానంలో కన్నా లక్ష్మి నారాయణను సీఎం గద్దె ఎక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఓవైపు మీడియాలో కూడా విస్తృత ప్రచారం లభిస్తోంది.
ఇదే విషయంలో గుంటూరులో మూడు రోజుల క్రితం కన్నా లక్ష్మీనారాయణ పోస్టర్లు కలకలం సృష్టించాయి. కాబోయే సీఎం కన్నా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. బుధవారం శ్రీనివాస గార్డెన్లో జరిగిన రచ్చబండలో కన్నా అభిమానులు రచ్చ రచ్చ చేశారు. సీఎం కిరణ్‌ను అధిష్టానం మారిస్తే ఆస్థానంలో కన్నా లక్ష్మీనారాయణను నియమిస్తారంటూ సంబరపడిపోతున్నారు. కాబోయే సీఎం కన్నా అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రోజు పీసీసీ అధ్యక్షుడు బొత్సతో కన్నా భేటీ అయ్యారు.
కాగా కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వరించిందంటూ ఇటీవలే ఆయన అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. హస్తిన నుంచి ఫోన్ వచ్చిందని కోట్ల ఇక సీఎం కుర్చీని అధిష్టించటమే తరువాయి అంటూ మిఠాయిలు పంచుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. మరి కన్నా విషయంలో ఏం జరుగుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.