
నంద్యాల వ్యవసాయం: కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని సీఎం చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగా సీఎం రమేష్‌తో దొంగదీక్షలు చేయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. నంద్యాల టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్కుపరిశ్రమ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం వేసిన మెకాన్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వడం లేదన్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, ఆర్థిక మంత్రులతో చర్చించిన తరువాతే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చిందన్నారు. జీఎస్టీ అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనని, ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రభుత్వం ప్రజలను, వ్యాపారులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అవినీతి వల్లే కరెన్సీ కష్టాలు నెలకొన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోట్లను టీడీపీ నాయకులు తరలించారన్నారు. రాయలసీమ జిల్లాలకు కృష్ణాజలాలు సక్రమంగా అందించేందుకు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం అత్యవసరమని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అస్పష్టమైన ప్రకటనతో ప్రాజెక్టు విషయమై ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. పప్పుధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించే విషయమై ప్రధానమంత్రితో చర్చిస్తానని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో స్థానిక మెడికేర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బుడ్డా శ్రీకాంతరెడ్డి బీజేపీలో చేశారు.
Comments
Please login to add a commentAdd a comment