![kapu reseravtions in 9th Schedule Without report ? - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/3/CM-ASSEMBLY-AP-5.jpg.webp?itok=ve6DBMeD)
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ, శాసనమండలిలో చేసిన ఈ రెండు ప్రకటనలను చదివిన వారికి ఏం అర్థమవుతుంది? త్వరలో కమిషన్ నివేదిక వస్తుందని, సమగ్రంగా చర్చించిన అనంతరం చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తారని భావిస్తాం. కీలకమైన బీసీ కమిషన్ నివేదికను ఇంకా ఇంతవరకు ప్రభుత్వానికి ఇవ్వలేదని సాక్షాత్తు ఆ కమిషన్ ఛైర్మనే చెబుతున్నా అసెంబ్లీలో బిల్లు పెట్టేసి కేంద్రంపై తోసేస్తే కాపులకు నిజంగానే రిజర్వేషన్లు వస్తాయా?.. కాదనే కాపు నేతలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలంటే కమిషన్ నివేదిక కచ్చితంగా ఉండాలి. ఏదైనా రాష్ట్రం 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వదలచుకుంటే ఆ నిర్ణయాన్ని సమర్థించుకునేలా సరైన గణాంక సమాచారం ఉండాలని సుప్రీంకోర్టు 1992లో ఇంద్రా సహానీ కేసులో తీర్పు ఇచ్చింది. కానీ చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నివేదిక ఇచ్చినట్లు చైర్మన్‌కే తెలియదు!
సమగ్ర సమాచారం కోసం బీసీ కమిషన్‌ను నియమించామని, అది వచ్చేంత వరకు ఆగాలని చెప్పిన చంద్రబాబే హడావిడిగా అసెంబ్లీలో బిల్లు పెట్టడంలో ఆంతర్యమేమిటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చిత్రమేమిటంటే ఏ కాపుల కోసం కమిషన్ వేశారో ఆ కమిషన్ ఛైర్మనే తమ సభ్యులు నివేదిక ఇచ్చారన్న సంగతి తనకు తెలియదనడం దేనికి సంకేతం? నిజంగా చంద్రబాబుకు కాపుల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా? అన్న అనుమానాలు ఎవరికైనా రాకమానవు.
న్యాయసమీక్షకు లోబడే...
రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చినప్పటికీ అది అత్యున్నత న్యాయస్థానాల న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమగ్ర సమాచారం ఉండాలి. అందుకు ప్రాతిపదికలు కమిషన్ నివేదికలు మాత్రమే. కానీ అటువంటిదేమీ లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం రిజర్వేషన్లపై తీర్మానం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్రానికి పంపింది.
హడావుడిగా తీర్మానం...
కాపుల రిజర్వేషన్ల కల సాకారం కావాలంటే సమగ్ర సమాచారం ఎంత అవసరమో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధీ అంతే అవసరం. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అధికారాన్ని అనుభవిస్తున్న టీడీపీ ప్రభుత్వం మంజునాథ్ కమిషన్ సేకరించిన సమగ్ర సమాచారం ఆధారంగా కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా.. అసలు కమిషన్ నివేదికనే తెప్పించకుండా హడావుడిగా తీర్మానం చేయించిన తీరు కాపుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. కమిషన్ పని తీరు ఎలా ఉంటుందో తెలియకుండానే మెజారిటీ సభ్యులు కాపు రిజర్వేషన్ల కోసం సిఫార్సు చేశారని శనివారం రాత్రి ఓ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందని కాపునేతలే విస్మయం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఏమిటో? అందులో ఏముందో తెలియకుండానే చట్టాలు చేస్తే అవి ఎలా చెల్లుబాటవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపుల కంటి తుడుపు కోసం ప్రభుత్వం ఈ పని చేసినట్టు అనిపిస్తోందని వాపోవడం గమనార్హం.
రెండు నాల్కలు- రెండు మాటలు
కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న మా ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నాం. అందుకే బీసీ కమిషన్‌ను నియమించాం. శాస్త్రీయంగా, పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం చేయాలన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లు ఆలస్యమైంది...
(శనివారం శాసన మండలిలో చంద్రబాబు)
బీసీ కమిషన్‌లో మెజారిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక ప్రాతిపదికనే సభలో బిల్లు ప్రవేశపెడుతున్నాం. దీన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చి న్యాయం చేయాలని కేంద్రానికి ప్రతిపాదన పంపుతున్నాం. కేంద్రం శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. కాపుల్ని బీసీల్లో చేర్చే విషయమై రాజకీయాలకు అతీతంగా కేంద్రంపై అన్ని పార్టీలూ ఒత్తిడి చేయాలి...
(శాసనసభలో చంద్రబాబు)
Comments
Please login to add a commentAdd a comment