పాతికేళ్లకు మళ్లీ వచ్చాడు..
హుస్నాబాద్: బొంబాయిలో పనిచేస్తానని చెప్పి భార్య, ఇద్దరు కూతుళ్లను వదిలి వెళ్లిన వ్యక్తి జాడ లేకుండా పోయాడు. 25 ఏళ్లకు మళ్లీ అతడు ఇల్లు చేరడంతో ఆ కుటుంబసభ్యుల ఆనందం అంతాఇంతా కాదు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం జంగపల్లికి చెందిన హన్మాండ్ల రాజమౌళి కుటుంబం 50 ఏళ్ల క్రితం హుస్నాబాద్‌కు వచ్చి స్థిరపడింది.
ఉపాధి కోసం రాజమౌళి 25 ఏళ్ల క్రితం ముంబయికి వలసవెళ్లాడు. అక్కడ మేస్త్రీ పని చేసుకుంటూ ఉన్న రాజమౌళి రెండు మూడు సార్లు ఉత్తరాలు రాశాడు. అనంతరం సమాచారం లేకుండా పోయాడు.దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అతడు ఉన్నాడో లేడో తెలియక భార్య వినోద, కూతుళ్లు మంజుల, రజిత ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నారు. వినోద కష్టపడి కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది.
హుస్నాబాద్‌లోనే ఉంటున్న పెద్ద కూతురు మంజుల తన తండ్రికి మిత్రుడైన రాజయ్య ఇటీవల ముంబయి వెళ్తుండగా తమ తండ్రి జాడ ఆరా తీయమని చెప్పింది. ముంబయి వెళ్లిన రాజయ్య అక్కడ భవన నిర్మాణ మేస్త్రీలను కలిసి రాజమౌళి వివరాలు చెప్పాడు. అతని కృషి ఫలించి రాజమౌళి సమాచారం లభించింది.
కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన రాజమౌళి మంగళవారంహుస్నాబాద్‌కు చేరుకున్నాడు. అతడిని చూసిన కూతుళ్లు, భార్య, బంధువులంతా ఆనందబాష్పాలు రాల్చారు. తనకు ఇంటిపై ధ్యాస లేకుండా పోయిందని, అక్కడే మేస్త్రీ పని చేసుకుంటూ ఉన్నానని రాజమౌళి చెప్పాడు. తమ ఊరికి చెందిన రాజయ్య ఇటీవల వచ్చి ఇంటి వద్ద పిల్లలు ఏడుస్తున్నారని చెప్పడంతో తిరిగి వచ్చానని తెలిపాడు.