మెనూ అమలుచేయాలని డిమాండ్
అల్పాహారం తినకుండా నిరసన
ఏటీడబ్ల్యూవో హామీతో విరమణ
పెదబయలు: వారం రోజులుగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం లేదని స్థానిక కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు. సుమారు 180 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని వారు ధ్వజమెత్తారు. అల్పాహారాన్ని బహిష్కరించి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్పాహారంగా చపాతి, వడ పెట్టాల్సి ఉండగా పొంగలి ముద్దలా ఉందని, సాయంత్రం ఇవ్వాల్సిన పండ్లు, మిఠాయి చాలా రోజులుగా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ నెల నుంచి కాస్తోటిక్స్ ఇవ్వడం లేదని వాపోయారు. ఆదివారం పెట్టిన మాంసం ఒక్కో విద్యార్థికి 100 గ్రామాలు కేటాయించాల్సి ఉండగా, 50 గ్రాములు మాత్రమే పెడుతున్నారని ఆరోపించారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం వల్ల తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని వివరించారు. ఇప్పటికైనా పాఠశాల ప్రత్యేకాధికారి సుధారాణి, అధికారులు స్పందించి మెనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పాఠశాలలో 77 రోజుల ప్రణాళిక తీరు, పాఠశాల మౌలిక సదుపాయాలపై మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని పీవో ఆదేశించినా ఫలితం లేదని పలువురు విమర్శిస్తున్నారు. విద్యార్థినుల ఆందోళన సమాచారం తెలుసుకున్న మండల ఉప గిరిజన సంక్షేమ అధికారి బి. సూర్యనారాయణ పాఠశాలకు వచ్చారు. విద్యార్థినుల ససమస్యలు తెలుసుకున్నారు. మెనూ అమలుచేయకపోవడంపై ప్రత్యేకాధికారి సుధారాణిపై మండిపడ్డారు. మెనూ అమలుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.
కస్తూర్బా విద్యార్థినుల ఆందోళన
Published Sun, Feb 22 2015 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement