సాక్షి, అమరావతి: కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ బారిన పడిన వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేపట్టామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.46 కోట్ల కుటుంబాలు ఉన్నాయని... ఇప్పటి వరకు రెండు దఫాలుగా సర్వే చేశామని వెల్లడించారు. 1.46 కోట్ల గృహాలను సర్వైవలెన్స్ పద్ధతిలో సర్వే చేశామని వివరించారు.
ఇప్పటివరకు 1.32 కోట్ల కుటుంబాలను రెండు సార్లు సర్వే చేశామని చెప్పారు. ప్రస్తుతం మూడో దశలో సర్వే కొనసాగుతోందన్నారు. ఇప్పుడు సర్వే అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు. కరోనా లక్షణాలు ఉంటే 14 రోజుల క్వారంటైన్‌కు రికమండ్ చేస్తారని.. కరోనా పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి పంపిస్తారని తెలిపారు. మూడో దశలో ఇప్పటివరకు 12,311 మంది అనుమానితులను గుర్తించి.. 1754 మందిని గృహనిర్బంధంలో ఉంచామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కాటంనేని భాస్కర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment