
నా భర్తను చంపించింది వారే: నారాయణరెడ్డి భార్య
కర్నూలు: పత్తికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు కేఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి, సోదరుడు ప్రదీప్‌రెడ్డి ఆరోపించారు. కేఈ కుమారుడు శ్యాంబాబు, ఎస్సై నాగ తులసీప్రసాద్ హత్యలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణరెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారని తెలిపారు.
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందునే నారాయణరెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియాకు కేఈ కుమారుడు శ్యాంబాబు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడించారు. గన్‌మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోయారు. రెన్యువల్ కోసం ఇటీవలే లైసెన్సెడ్ తుపాకీని నారాయణరెడ్డి డిపాజిట్ చేశారని తెలిపారు. మూడు నెలలైనా రెన్యువల్ చేయకపోవడం వల్లే ఆయన హత్యకు గురయ్యారని పేర్కొన్నారు.
తమ కుటుంబంపై ఎన్నేళ్లు కక్ష సాధిస్తారని శ్రీదేవి రెడ్డి ప్రశ్నించారు. హత్య రాజకీయాలు చేసే బదులు ఇంట్లో కూర్చుని చీరలు కట్టుకోవాలని అన్నారు. తన పిల్లలకు తండ్రి లేకుండా చేశారని కన్నీళ్లపర్యంతమయ్యారు. ఏదైతే లక్ష్యం కోసం తన భర్త పోరాడారో దాని కోసం తన ఊపిరి ఉన్నంతవరకు పోరాడతానని పేర్కొన్నారు.