జేసీ బ్రదర్స్ అండతోనే..
అనంతపురం: జేసీ బ్రదర్స్ అండతోనే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని తాడిపత్రి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. సీబీఐ దాడులు అనంతరం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని.. దీపక్‌రెడ్డి అరెస్టైనా చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. వాకాటికో న్యాయం, దీపక్‌రెడ్డికి మరో న్యాయమా అని అడిగారు. పెద్దారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ... దీపక్‌రెడ్డిపై తెలంగాణ ప్రభుత్వం ‘సిట్’తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నడిబొడ్డుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వందల కోట్ల విలువైన స్థలాలను కబ్జా చేయడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలతో దీపక్‌రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. వాకాటి నారాయణరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు జరిపిన మరుసటి రోజే ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. దీపక్‌రెడ్డిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విపక్షాలు పేర్కొంటున్నాయి.