కీటోన్స్ సాధారణ స్థాయికి రావాలి- జగన్ ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు
‘శరీరంలోని గ్లూకోజ్ నిల్వలు పూర్తిగా వినియోగమైన తర్వాత కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. ఈ కొవ్వు కరుగుతున్న క్రమంలోనే కీటోన్స్ అనే చెడు పదార్థాలు విడుదలవుతాయి. ఇవి శరీరంలో అసలు ఉండకూడదు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శరీరంలో అవింకా 1.9 మోతాదులో ఉన్నాయి. ఆయన నిమ్స్‌లో చేరిన రోజు ఇవి 4కు మించి ఉన్నాయి. ఈ కీటోన్స్ పూర్తిగా తగ్గిన తర్వాతే ఆయన డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటాం..’ అని నిమ్స్ వైద్య బృందం తెలిపింది. ఆమరణ నిరాహార దీక్ష భగ్నం తర్వాత నిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న జగన్‌కు సోమవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, చక్కెర నిల్వలు, పల్స్‌రేటు సాధారణ స్థాయికి చేరుకున్నా, సోడియం నిల్వలు, కీటోన్స్ ఇంకా నియంత్రణలోకి రావాల్సి ఉందని వైద్యులు తెలిపారు. కీటోన్స్ మీద అశ్రద్ధ చేస్తే కిడ్నీకి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, అందువల్ల అవి సాధారణ స్థాయికి వచ్చిన తర్వాతే జగన్‌మోహన్‌రెడ్డిని డిశ్చార్జి చేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ముగ్గురు వైద్యుల బృందం వివరించింది.
మొత్తంమీద ఆయన కొంత తేరుకున్నట్టు కన్పించిందని వైద్యులు చెప్పారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలతో పాటు కొన్ని ఆంగ్ల వార పత్రికలూ చదివారని వెల్లడించారు. తన వైద్య పరీక్షల నివేదికనూ చూసిన జగన్ అందులోని వివరాలను తమను అడిగి తెలుసుకున్నారని ఓ వైద్యుడు సాక్షికి తెలిపారు. ఇలావుండగా సోమవారం కూడా జగన్ సతీమణి వైఎస్ భారతి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిమ్స్‌లో ఆయన వద్ద ఉన్నారు. ఆమె నిమ్స్‌నుంచి వెళ్లేముందు జగన్ అభిమానులు కొందరు ఆయన ఆరోగ్యంపై ఆరాతీయగా.. కోలుకుంటున్నారని చె ప్పారు. సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి కావడంతో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు నిమ్స్‌కు తరలి వచ్చారు.