సీఎం కిరణ్ అబద్ధాల కొరియర్: వివేక్
మంచిర్యాల: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు నిత్యం అడ్డుపడుతూ అబద్ధాల కొరియర్‌గా వ్యవహరిస్తున్నాడని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎంపీ జి.వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్రానికి తప్పుడు నివేదికలిస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. మూడు ప్రాంతాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన ఆయన కేవలం సీమాంధ్రకే సీఎంగా పని చేస్తున్నారని అన్నారు. సీడబ్ల్యూసీ, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినా అందుకు విరుద్ధంగా సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాలకు ఆజ్యం పోస్తున్నాడని ఆరోపించారు.
సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమాల్లోకి వెళ్లాలని సూచించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఎంను కేంద్రం తక్షణమే బర్తరఫ్ చేయాలని కోరారు. ఇక జీవోఎంకు కేసీఆర్, కేశవరావులతోపాటు తాను కలిసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అమరుల త్యాగాలను 60 ఏళ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరించి, నివేదిక ఇచ్చామని చెప్పారు. అహింసా మార్గంలో తెలంగాణ ప్రజలు ఉద్యమించారని, సీమాంధ్రులు కూడా ఆనాడు మద్రాసు నుంచి తరిమికొట్టించుకున్న పరిస్థితులు మళ్లీ తెచ్చుకోవద్దని, అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సహకరించాలని ఎంపీ వివేక్ కోరారు.