కిరణ్ ఎందుకిలా చేస్తున్నారు?
హైదరాబాద్: శాసనమండలిలో సీఎం కిరణ్ వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి మండిపడ్డారు. విభజన విషయంలో బీహార్, యూపీ సంప్రదాయాలను పాటించాలని చెబుతున్న సీఎం- ఇక్కడెందుకు వాటిని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అక్కడ విభజన తీర్మానంపై చర్చ జరిగాకే బిల్లు పెట్టారని గుర్తు చేశారు. మరిక్కడ ఎందుకిలా చేస్తున్నారని నిలదీశారు.
సీఎంగా మీ బాధ్యతలేంటో మీరు నిర్వహించాలని సూచించారు. సమైక్య ముసుగులో సోనియా గాంధీ ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిద్దామని గతంలో చెప్పిన సీఎం - శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో ఎందుకు మౌనంగా ఉన్నారని అంతకుముందు ఆమె ప్రశ్నించారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.