కేసీఆర్తో మాకు సంబంధం లేదు: డీకె అరుణ
రాష్ట్ర మంత్రుల మధ్య అసెంబ్లీ లాబీల్లో బుధవారం ఆసక్తికర సంభాషణలు కొనసాగాయి. అలాంటి సంభాషణే.. తెలంగాణ మంత్రి డీకే అరుణ, సీమాంధ్ర మంత్రి.. పార్థసారథి మధ్య అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకుంది. విభజన ప్రక్రియ ఆగుతుందేమో, రాష్ట్రం విడిపోదేమోనని మంత్రి పార్థసారథి.. డీకే అరుణతో వ్యాఖ్యానించగా.. విభజన ప్రక్రియ సజావుగా సాగుతోందని.. రాష్ట్రం విడిపోవడం ఖాయమని.. ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీ పెడతారేమోనన్న పార్థసారధి వ్యాఖ్యలకు స్పందించిన అరుణ.. హైకమాండ్‌కు కిరణ్ విధేయుడని దిగ్విజయ్ చెబుతున్నారని.. ఆయన కొత్త పార్టీ పెట్టరేమోనని జవాబిచ్చారు. కాగా.. కేసీఆర్‌కు తెలంగాణ రావాలని లేదట కదా అని పార్థసారథి అన్నారు.
కేసీఆర్‌తో తమకు సంబంధం లేదని.. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ కాంగ్రెస్ మొదటినుంచీ పోరాడుతోందని అరుణ అన్నారు. ఇది ఇలా ఉండగా.. కిరణ్ కొత్తపార్టీ పెట్టే అవకాశముందని.. మరోమంత్రి టీజీ వెంకటేష్ లాబీల్లో అన్నారు. కిరణ్ కొత్త పార్టీతోపాటు.. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీకి వెళ్లేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. టీజీ మనసులోమాట బయట పెట్టారు.