కిరణ్ చక్కబెడుతున్నారు
* సీఎం సమ్మెలు విరమింపజేస్తుండడంతో ఉద్యమాలు తగ్గాయంటూ దిగ్విజయ్ వ్యాఖ్యలు
* అధిష్టానం కోరినట్లుగా విభజనకు మార్గం సుగమం చేస్తున్న కిరణ్
* దీంతో సీఎం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్న హైకమాండ్
* తమ డెరైక్షన్ మేరకు పనిచేస్తున్నందువల్లే.. సీఎంను మార్చే ఆలోచన లేదన్న డిగ్గీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చక్కదిద్దుకుంటూ రావడంపట్ల కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రజల ఆందోళనతోపాటు, కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ సమ్మె బాట పట్టిన నేపథ్యంలో ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంపై మొదట్లో కాంగ్రెస్ హైకమాండ్ కొంత ఆందోళనకు గురైంది. ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరాన్ని వివరిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మార్గనిర్దేశం చేసింది.
తాజాగా రాష్ట్ర పరిస్థితులను సమీక్షించిన ఢిల్లీ నేతలు.. తాము చెప్పిన విధంగా సీఎం ఒక్కొక్కటిగా సమస్యలను చక్కదిద్దుతూ సాధారణ పరిస్థితులు కల్పిస్తున్నారని పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సీమాంధ్రలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, అక్కడ ఉద్యమాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ బుధవారం పేర్కొన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
తీర్మానం పేరుతో మభ్యపెట్టి..
విభజనను వ్యతిరేకిస్తూ 70 రోజులకు పైగా సీమాంధ్రలో ఉద్యమం సాగుతున్న సంగతి తెలిసిందే. సీమాంధ్ర ప్రజల భావోద్వేగానికి అనుగుణంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తోడై ఉప్పెనలా ఉద్యమం సాగుతున్న దశలో అది రాజకీయ మలుపు తీసుకోకుండా ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తగా పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో కథ నడిపించారన్న విమర్శలున్నాయి. ఉద్యమం ‘రాజకీయ మలుపు’ తీసుకుంటే దాన్ని నియంత్రించడం సాధ్యం కాదని తెలిసే అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని ఒకసారి, తన హయాంలో విభజన జరగదని మరోసారి... రకరకాలుగా నేతలను నమ్మించారని చెబుతున్నారు.
అదే అంశంపై విస్తృతంగా ప్రచారం చే యగా, చివర్లో దశలవారీగా ఉద్యోగ, కార్మిక సంఘాలను చర్చలకు పిలిచారు. తీర్మానాన్ని అడ్డుకోవడం ద్వారా ప్రక్రియకు బ్రేక్ వేస్తామని మభ్యపెట్టి సమ్మె విరమించేలా చేశారు. ఈ సంఘాలు ఒక్కొక్కటిగా సమ్మె విరమించుకుంటున్నామని ప్రకటనలు చేసిన దరిమిలా సీమాంధ్రలో ఉద్యమం మెల్లమెల్లగా సర్దుకుంటుందని హైకమాండ్‌కు నివేదించారు. దీంతో సమైక్య ఉద్యమం బలహీన పడిందని హైకమాండ్ అభిప్రాయానికి వచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
తెలంగాణ అంశంపై తీర్మానం కోసం బిల్లు అసెంబ్లీకి రాదని, కేవలం అభిప్రాయం కోసమే ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తుందని ఇప్పుడు ఖాయంగా తేలిపోయినప్పటికీ బయటివారెవరూ నమ్మలేనంతగా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా ప్రచారం చేయించారని, ఈ రకంగా మభ్యపెట్టి ఉద్యోగ సంఘాలను వ్యూహాత్మకంగా ఆందోళన బాటనుంచి తప్పించారని అంటున్నారు. తమ డెరైక్షన్ మేరకు సంతృప్తికరంగా పనిచేస్తున్న కారణంగానే ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన ఏదీ లేదని దిగ్విజయ్ ప్రకటించినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.