పొగిరి జెడ్‌పీ హైస్కూల్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు కొడాలి నాని, కృష్ణదాస్
సాక్షి, రాజాం/రూరల్: ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించాలంటే ప్రాథమిక విద్య చాలా బలంగా ఉండాలని, అప్పుడే విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకుంటారని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. గురువారం పొగిరి జెడ్‌పీ హైస్కూల్ వద్ద ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి ప్రారంభించారు. శిలాఫలకాన్ని పాఠశాల ఆవరణలో ఆవిష్కరించి, సరస్వతీదేవి విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యలో స్పష్టమైన మార్పు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేకతను తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి అన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించేందుకు వీలుగా ఆంగ్ల మాధ్యమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. తప్పనిసరిగా తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంటుందన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి చాలా చోట్ల విద్యార్థులతో మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలల రూపురేఖలు మార్చుతామని హామీ ఇచ్చారని, ఇందులో భాగంగానే ఈ బృహత్తర కార్యక్రమం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 16 వేల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 33 వేల కోట్లు కేటాయించామని చెప్పారు.
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొడాలి నాని
అయోమయంలో చంద్రబాబు
చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయిన బాధ నుంచి తేరుకోలేకపోతున్నారని, ఇంకా అయోమయంలోనే కొనసాగుతున్నారని కొడాలి నాని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం పెడుతుంటే విమర్శలకు దిగుతున్న చంద్రబాబు... ఎన్‌టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో గండిపేటలో నిర్వహిస్తున్న పాఠశాల ఏ మీడియంలో నడుస్తుందో ప్రజలకు చెప్పాలని సవాలు విసిరారు. ఇంగ్లీషు మాధ్యమంలో బోధిస్తే విద్యార్థులు మట్టి కొట్టుకుపోతారని పవన్ కళ్యాణ్ విమర్శించారని, మరి తన పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో కనీసం తన అభిమానులకైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పనిపాట లేక విజయవాడ చుట్టుపక్కల తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన సోదరుడి కొడుకైన ఎంపీ రామ్మోహన్‌నాయుడు బహుశా ఇంగ్లీషు మీడియంలో చదివి ఉండడం కారణంగానే ఢిల్లీలో బాగా మాట్లాడగలుగుతున్నారని గుర్తు చేశారు. ఈయనకు ఆ చదువు అబ్బక ఇక్కడే ఉండిపోయారన్నారు.
వ్యవసాయం, విద్య, వైద్యంపై సీఎం దృష్టి
జిల్లా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విద్య, వ్యవసాయం, వైద్య రంగాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు నెహ్రూ జయంతి సందర్భంగా ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరేవి కావని, ఇలా చేస్తే కార్పొరేట్ పాఠశాలలు నష్టపోతాయని వారు భావించేవారని ఆరోపించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం, మైదానాలు, నీటి సౌకర్యం, బెంచీలు, లైట్లు, ఇంగ్లిషు ల్యాబ్‌లు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులెడుతుందన్నారు.
సమావేశానికి హాజరైన మహిళలు, విదార్థులు, పెద్దలు
సామాజిక పింఛన్లు పెంపు, ఆశా కార్యకర్తలు, వెలుగు యానిమేటర్ల గౌరవ వేతనం పెంపు, ఆటో డ్రైవర్లకు రూ.10 వేల నగదు సాయం, అగ్రి గోల్డ్ బాధితులకు రూ.10 వేలు పంపిణీ, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా రైతులందరికీ ఆర్థిక చేయూత, 4 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన వంటివి చేపట్టారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ మాట్లాడుతూ యువత అంతా వైఎస్సార్‌సీపీ వైపు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఎస్‌వీ రమణారావు, రాజాం కన్వీనర్లు పాలవలస శ్రీనివాసరావు, లావేటి రాజగోపాలనాయుడు, జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్ ముఖర్జీ, టంకాల అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, జేసీ శ్రీనివాస్, డీఈఓ కె.చంద్రకళ, పాలకొండ ఆర్డీఓ టి.వి.ఎస్.జి.కుమార్, నియోజకవర్గ ప్రత్యేకాధికారి బి.శాంతికుమారి, రాజాం మండలం ప్రత్యేకాధికారి ఎం.జగన్నాధం తదితరులు ఉన్నారు.
థ్యాంక్యూ సీఎం...
ఈ సమావేశంలో పొగిరి జెడ్‌పీ హైస్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాథ్యమం ప్రవేశపెట్టడం ద్వారా తమకు ఎంతో బాగుంటుందని వారన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేలు మరువలేమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment