
ఈ నిధులు ఏమూలకు!
• కృష్ణా పుష్కరాలకు రూ. 800 కోట్లతో ప్రతిపాదనలు
• రూ. 250 కోట్లు విదిల్చిన రాష్ట్ర ప్రభుత్వం
• నగరపాలక సంస్థ కేటాయింపులపై స్పష్టత ఏదీ
• ఖజానాపై భారం తలుచుకునికార్పొరేషన్ పరేషాన్
రాజధాని ఏర్పడిన తర్వత తొలిసారి జరగనున్న కృష్ణా పుష్కరాలకు విజయవాడ నగరం ప్రధాన వేదిక కానుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉండటంతో పుష్కర స్నానంతో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చనే ఆలోచనతో భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో జరగనున్న పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో ఈ నిధులు ఏమూలకు సరిపోతాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్‌పై భారం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ : కొత్త రాష్ట్రం.. కొత్త రాజధాని.. ఈ క్రమంలో వస్తున్న కృష్ణా పుష్కరాలు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. ఆగస్టులో జరిగే పుష్కరాలను విజయవంతం చేయాలంటే సమష్టి కృషితోపాటు నిధుల విడుదలలో సర్కారు కాస్త పెద్ద మనసు చేసుకోవాల్సి ఉంది. పుష్కరాల నిర్వహణకు జిల్లాలో రూ.450 కోట్లు, విజయవాడ కార్పొరేషన్ పరిధిలో రూ. 350 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు మంజూరుచేసింది. ప్రధానంగా పుష్కరాలకు కేంద్ర బిందువైన విజయవాడ నగరంలో సుందరీకరణ పనులు మొదలుకొని, పుష్కర ఘాట్ల మరమ్మతుల వరకు ఎన్నో పనులు జరగాల్సి ఉంది. మెరుగైన పారిశుద్ధ్యం, అదనపు సిబ్బంది వినియోగం వంటివి వందల కోట్ల ఖర్చుతో కూడుకున్న అంశాలు. ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిధులు విడుదల చేయడం, కార్పొరేషన్‌కు ఎంత ఇచ్చేదీ స్పష్టంగా ప్రకటించకపోవడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలే లోటు బడ్జెట్‌తో కోట్లాది రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయవాడ నగరపాలక సంస్థకు పుష్కరాలు గుదిబండలా మారే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
నగరానికి ప్రాధాన్యత ఏదీ!
పుష్కరాల్లో విజయవాడ నగరం కీలక కేంద్రంగా మారుతుంది. ముఖ్యమంత్రి నుంచి వీవీఐపీల వరకు అంతా ఇక్కడే ఉంటారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, వీఐపీల తాకిడి ఎక్కువగా విజయవాడ నగరానికే ఉంటుంది. కనకదుర్గమ్మవారి దేవస్థానం ఉండడంతో యాత్రికుల రద్దీ అధికంగానే ఉంటుంది. అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా నగరాన్ని కేవలం నాలుగు నెలల కాలంలో తాత్కాలిక అభివృద్ధి చేయాలంటే కనీసం రూ.250 కోట్ల నిధులు అవసరం. కాని ప్రభుత్వ కేటాయింపులు ఇప్పటికే పూర్తికావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి ప్రభుత్వం వివిధ శాఖలతో నిమిత్తం లేకుండానే రూ.234 కోట్ల నిధులు కేటాయించింది. తక్కువ సమయం ఉండడంతో రూ.170 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మాత్రమే చేశారు. దీంతో అక్కడ రూ.64 కోట్ల నిధులు మిగిలిపోయాయి.
రూ.760 కోట్ల నుంచి రూ.350 కోట్లకు
గతంలో నగరపాలక సంస్థ అధికారులు పుష్కరాల అభివృద్ధి పనులు, పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ కార్యక్రమాల నిర్వహణ, ఇతర పనుల కోసం రూ.760 కోట్లు అవసరమని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రతిపాదనల స్థాయి ఎక్కువగా ఉందని, తగ్గించి మళ్లీ పంపాలని మౌఖిక ఆదేశాలు అందిన క్రమంలో రూ.350 కోట్లతో మార్పుచేసి పంపారు. ఇప్పటికే నగర మేయర్, కమిషనర్ సీఎం చంద్రబాబును కలిసి నిధులు మంజూరుచేయాలని కోరారు. నిరంతర శానిటేషన్ కోసం 35 వేల మంది అదనపు సిబ్బంది నియామకానికి వీలుగా నిధులు, వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు, పుష్కర ఘాట్ల వద్ద 24 గంటలు పారిశుద్ధ్య నిర్వహణ, 200కు పైగా అద్దె వాహనాలు, పుష్కరాల నేపథ్యంలో నగరంలోని కీలక రహదారుల విస్తరణ, తాత్కాలిక వసతి కోసం భారీ షెడ్ల ఏర్పాటు.. ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధుల విషయంలో మొండిచెయ్యి చూపితే నగరపాలక సంస్థ ఖజనాకు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది.
కోటలు దాటే మాటలు..
కృష్ణా పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా.. నామమాత్రంగా నిధులు విడుదల చేయడం విమర్శలకు దారితీస్తోంది. డబ్బుల్లేకుండా అభివృద్ధి పనులెలా చేయాలని నగరపాలక సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాకు కేటాయించిన రూ.250 కోట్లలో ఎక్కువగా పంచాయతీరాజ్, జలవనరుల శాఖలకే దక్కనున్నాయి. ఈ క్రమంలో విజయవాడ నగరానికి ఏమేర అవసరం ఉంది. తక్షణం ఎంత కేటాయించాలి... మిగిలిన నిధులు ఎప్పుడివ్వాలి అనే దానిపై స్పష్టత లేదు.