సాక్షి, అమరావతి/విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం మల్లన్న చెంతకు కృష్ణా జలాలు పోటెత్తుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు కృష్ణా నది నుంచి 29 వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 1740 క్యూసెక్కులు కలిపి 30,740 క్యూసెక్కుల ప్రవాహ జలాలు చేరుతున్నాయి. దాంతో ఇక్కడి జలాశయంలో నీటి నిల్వ 38.29 టీఎంసీలకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేసిన వరద జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. ప్రాజెక్ట్ వద్ద 9 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. స్పిల్ వే ద్వారా 42,244, విద్యుత్ కేంద్రం ద్వారా 28,779 క్యూసెక్కులు కలిపి 71,023 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వీటికి తోడు హంద్రీ, తుంగభద్ర నుంచి వరద చేరుతుండటంతో శ్రీశైలం జలాశయంలోకి వచ్చే ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. నాగార్జున సాగర్ దిగువన కురిసిన వర్షాల వల్ల మున్నేరు, మూసీ నదుల నుంచి పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 12,137 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 8.53 టీఎంసీలకు చేరుకుంది.
► ఎగువ నుంచి గతేడాది జూలై 30న శ్రీశైలానికి వరద ప్రవాహం రాగా.. ఈ ఏడాది రెండు వారాల ముందే రావడం గమనార్హం.
► తుంగభద్ర జలాశయంలోకి 8,029 క్యూసెక్కులు చేరుతోంది. గోదావరి నదిలో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 48,679 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 45,679 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
► వంశధార నది నుంచి 7,985 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు.
తెరుచుకున్న ప్రకాశం బ్యారేజీ గేట్లు
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. బుధవారం ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతంగా రావడంతో 30 గేట్లు ఎత్తి 21,750 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదిలారు.
మల్లన్న చెంతకు కృష్ణమ్మ
Published Thu, Jul 16 2020 4:23 AM | Last Updated on Thu, Jul 16 2020 4:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment