పసుపు– కుంకుమ నిధులు వద్దని చెబుతున్న పొదుపు గ్రూపు మహిళలు
కర్నూలు,ఆత్మకూరు: పసుపు– కుంకుమ పథకం తమకు వద్దే వద్దని, తాము టీడీపీ కండువా ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పుకునేది లేదని పొదుపు మహిళలు తెగేసి చెప్పారు. డబ్బు కోసం తాము టీడీపీ కండువా ఎట్టి పరిస్థితుల్లో కప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఆత్మకూరు పట్టణం చిట్యాల వీధిలోని గంగమ్మ గుడి వద్ద పొదుపు ఐక్య సంఘాల లీడర్లు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. పసుపు– కుంకుమ కింద రూ.10 వేలు కావాలంటే టీడీపీ కండువా వేసుకోవాలని ఆ పార్టీకి చెందిన పొదుపు ఐక్య సంఘం సభ్యులు సరోజ, లక్ష్మీదేవి, ఈడిగ శేషమ్మ, సుశీలాబాయి చెప్పారు.
దీంతో మిగతా సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పొదుపు సమావేశామా..ఇది రాజకీయ సమావేశామా చెప్పండి’ అంటూ ప్రశ్నించారు. రాజకీయ సమావేశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే రూ.10 వేలు సొమ్ము తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. సుభద్రమ్మ అనే ఐక్య సంఘం లీడర్ టీడీపీ కండువా కప్పుకుంటే చాలు.. రూ.10 వేలు ఇస్తామని టీడీపీ పొదుపు మహిళలు చెప్పారు. దీంతో సుభద్రమ్మ స్పందిస్తూ..తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయబోనని, తనకు ఆ డబ్బులు అవసరం లేదని చెప్పారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వచ్చినా ఇదే విషయం చెబుతామన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేతోనే తాడోపేడో తేల్చుకుంటామని సమావేశం నుంచి బయటకు వచ్చారు. కాగా..ఆత్మకూరు పట్టణం చిట్యాల వీధిలో 20 పొదుపు మహిళాసంఘాలు ఉన్నాయి. వీటిలో 220 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం పొదుపు 20 గ్రూపులకు లీడర్‌గా సుభద్రమ్మ ఉన్నారు.
రూ.10 వేలు అవసరం లేదు
పొదుపులో ఉన్నవారందరికీ పసుపు– కుంకుమ కింద రూ.10 వేలు ఇస్తామన్నారు. టీడీపీ కండువా వేసుకుంటేనే డబ్బు ఇస్తామని ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఆ డబ్బే మాకు వద్దే వద్దు.– సలాంబీ
భయపడేది లేదు
పార్టీ మారకపోపతే రూ.10వేలు ఇవ్వబోమని ఎమ్మెల్యే బుడ్డా రాజేశేఖర్ రెడ్డి చెప్పమనండి. ఇది పొదుపు సమావేశామా? రాజకీయ సమావేశమా? సరోజ, లక్ష్మీదేవి లాంటి మహిళలకు భయపడేది లేదు. టీడీపీ కండువాలు కప్పుకునేది లేదు. – జయమ్మ
Comments
Please login to add a commentAdd a comment