నన్ను ఓడిస్తావా అంటూ కేవీపీ సెటైర్లు
హైదరాబాద్ : అసెంబ్లీ లాబీలో బుధవారం రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి కేవీపీ రామచంద్రరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. నాకున్న ఆత్మీయుల్లో నీవొక్కడివి అంటూ ఎర్రంను కేవీపీ పలకరించారు. రెబల్ అభ్యర్థికి మద్దతిస్తున్నావ్... వేర్పాటువాదినైన నన్ను ఓడిస్తావా అంటూ కేవీపీ వ్యంగ్యంగా సెటైర్లు వేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఓటెయ్యమంటే వారికే ఓటేస్తానని ఎర్రం తెలిపారు. కాగా రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో, ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకునే పనిలో కేవీపీ పడ్డారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా ఆయన భేటీ అయ్యారు.
నాలుగో అభ్యర్థికి సరిపడ ఓట్లు ఉన్నా...బరిలోకి దింపకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కు తాకట్టు పెట్టడం సబబు కాదని బొత్స సత్యనారాయణకు చెప్పామని... నాలుగో అభ్యర్థిగా తెలంగాణ కాంగ్రెస్ నేతనే బరిలోకి దింపాలన్నామని ఎర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. దళితుడైన విప్ ఆరేపల్లి మోహన్ను నిన్న నామినేషన్ వేయాల్సిందిగా కోరామని ...టీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపు కోసం కాంగ్రెస్ నాలుగో అభ్యర్థిని నిలబెట్టకపోవటం ముమ్మాటికీ తప్పేనని ఎర్రం పేర్కొన్నారు.