
కేవీపీ రామచంద్రరావు (ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి : జ్యోతిరావు పూలే విగ్రహ నివాళి ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు శనివారం లేఖ రాశారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ఘర్షణలు జరగడం దురదృష్టకరమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు. మహాత్మల జయంతి, వర్థంతులకు ప్రముఖులను ఆహ్వానించడం ఆనవాయితీ అని, కానీ విజయవాడలో పోలీసులు ఓవరాక్షన్ చేశారని కేవీపీ ఆరోపించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అంగీకరించలేదని, అంతేకాకుండా తమను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రోటోకాల్ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలని కేవీపీ లేఖలో కోరారు.
కాగా పూలే విగ్రహానికి నివాళి వివాదంలో కాంగ్రెస్ అగ్రనేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు సహా 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనపై కేవీపీ సీఎస్‌కు లేఖ రాశారు. పోలీసులు మా హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని లేఖలో పేర్కొన్నారు.