
శేషాచలం ఎన్‌కౌంటర్ నరమేధమే..!
శేషాచలం అడవుల్లో ఇరవై మంది తమిళ కూలీలను కాల్చిచంపిన ‘ఎన్‌కౌంటర్లు’ ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్లేనని..
కూలీల ‘ఫోన్ కాల్స్’ డేటానే సాక్ష్యం
20 మంది కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపిన పోలీసులు
కాల్పుల్లో చనిపోయే కొన్ని గంటల ముందు వరకూ తమిళనాడు సరిహద్దుల్లో, తిరుపతి పరిసరాల్లో కూలీల సంచారం
ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వారి కాల్ డేటా రికార్డుల వివరాలు
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో ఇరవై మంది తమిళ కూలీలను కాల్చిచంపిన ‘ఎన్‌కౌంటర్లు’ ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటర్లేనని.. వారందరినీ అంతకుముందే పోలీసులు అదుపులోకి తీసుకుని, అడవుల్లోకి తీసుకెళ్లి దారుణంగా కాల్చిచంపారని చెప్పేందుకు తాజా సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అటవీ సిబ్బంది కాల్పుల్లో చనిపోయిన ఎర్రచందనం కూలీల సెల్‌ఫోన్లకు సంబంధించిన ఫోన్ కాల్స్ వివరాలు.. మృతుల్లో పలువురు ఆ ముందు రోజు సాయంత్రం, రాత్రి వరకూ తమిళనాడు సరిహద్దుల్లో, తిరుపతి ప్రాంతంలోనే సంచరించినట్లు నిర్ధారిస్తున్నాయి. శేషాచలం ‘ఎన్‌కౌంటర్’లో మృతి చెందిన 20 మంది తమిళ కూలీల్లో ఎనిమిది మంది సెల్‌ఫోన్లు వినియోగించారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసు అధికారులు.. ఆ 8 మంది సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్ రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దర్యాప్తు చేసి, సాక్షులను విచారించి ఆ వివరాలను కేంద్ర మానవ హక్కుల సంఘానికి సమర్పించారు.
పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో ఏమన్నారు?
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లు నరికి, దుంగలు తీసుకెళ్లేందుకు తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో కూలీలు ఏప్రిల్ ఆరో తేదీ నాటికే అడవుల్లోకి వచ్చారని.. వారు భారీగా ఎర్రచందనం చెట్లు నరికి దుంగలు తీసుకెళ్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఆరో తేదీ రాత్రే పోలీసులు, అటవీ సిబ్బందితో కూడిన రెండు బృందాలు కూంబింగ్ మొదలు పెట్టారు. ఏడో తేదీ తెల్లవారుజామున ఎర్రచందనం చెట్లు నరికి ఆ దుంగలను మోసుకెళ్తున్న వంద మందికి పైగా స్మగ్లర్లు ఈ బృందాలకు తారసపడ్డారు. వారిని లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించగా.. వారు ‘మారణాయుధాల’తో పోలీసులపై దాడి చేశారు. పోలీసులు ఆత్మరక్షణార్థం ఎదురు కాల్పులు జరపగా.. రెండు చోట్ల 20 మంది స్మగ్లర్లు, కూలీలు చనిపోయారు.
మృతుల బంధువులు ఏం చెప్పారు?
కూలీలు అడవుల్లోకి వెళ్లకముందే.. పోలీసులు ఏప్రిల్ ఆరో తేదీన చిత్తూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో వారిని అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని కూడా బస్సును అటకాయించి మరీ విచారణ పేరుతో పట్టుకెళ్లారు. వారందరినీ అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చిచంపి.. ఎన్‌కౌంటర్ కట్టుకథ అల్లారు. మానవ హక్కుల సంఘాలు, తమిళ సంఘాలు, మృతుల బంధువులు ఇవే ఆరోపణలు చేస్తున్నారు.
మృతుల సెల్‌ఫోన్లు ఏం చెప్తున్నాయి?
పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన పెరుమాళ్ (37), పళణి (35), మగేంద్రన్ (25) ల సెల్‌ఫోన్ సీడీఆర్‌లను పరిశీలిస్తే.. వారు ముందు రోజు సాయంత్రం వరకూ ప్రయాణిస్తునే ఉన్నారు. సాయంత్రానికి తిరుపతి సమీపంలో ఉన్నారు. తెల్లవారుజామున ‘ఎన్‌కౌంటర్లు’ జరగటానికి ముందు.. అపరాత్రి 2.30 గంటల సమయంలో వారు ‘ఎన్‌కౌంటర్లు’ జరిగిన ప్రదేశంలోనే ఉన్నారు. అప్పుడు కూడా వీరిలో కొందరి సెల్‌ఫోన్ల నుంచి తమ ఇళ్ల పక్కనవారికి ఫోన్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వెళ్లాయి. 2.30 గంటల సమయంలో వీరి సెల్ ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి.
అంటే అర్థం ఏమిటి..?
శేషాచలం అడవుల్లో వందలాది మంది స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారని తమకు సమాచారం అందిందని.. వెంటనే ఆరో తేదీ రాత్రి నుంచే అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టామని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చెప్పిన కథనం. ఆ క్రమంలో కూలీలు ఎదురుపడగా.. వారి దాడి నుంచి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన కూలీల పక్కన ఒక్కొక్కరికి ఒక్కో దుంగ లెక్కన.. ఎర్రచందనం దుంగలూ పడివున్నాయి. అంటే.. పోలీసులు అడవుల్లోకి గాలింపు మొదలుపెట్టే సరికే కూలీలు అడవుల్లోకి వెళ్లి చెట్లు నరికి, వాటిని మోసుకుపోతూ ఉండాలి. అదే నిజమైతే..సెల్‌ఫోన్లు జేబుల్లో పెట్టుకుని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో సంచరిస్తుండటం ఎలా సాధ్యం? అడవుల్లో చెట్లు నరికి, వాటిని శుభ్రంచేసి.. ఏడో తేదీ తెల్లవారుజాము ఐదారు గంటలకల్లా ఆ దుంగలను భుజాలపై మోసుకుంటూ వెళ్తున్న వారు.. అంతకు కొన్ని గంటల ముందే తిరుపతి పరిసరాల్లో సంచరించటం ఎలా సాధ్యం? రాత్రి 9 గంటల వరకూ తిరుపతి పరిసరాల్లో తిరుగుతున్న వారు.. ఎన్‌కౌంటర్‌లో చనిపోవటానికి కొన్ని గంటల ముందుగానే ఆ ఎన్‌కౌంటర్ల ప్రాంతానికి ఎర్రచందనం దుంగలు మోసుకుంటూ రావటం ఎలా సాధ్యం? అంటే.. ఈ కూలీలను ఏప్రిల్ ఆరో తేదీ సాయంత్రం చిత్తూరు - తమిళనాడు సరిహద్దుల్లోని వడమాలపేట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని.. వారందరినీ అదే రాత్రి శేషాచలం అడవుల్లోకి తీసుకెళ్లి.. తెల్లవారు జామున ఉదయం 5.30 నుంచి 6 గంటల మధ్య కాల్చి చంపినట్లు వెల్లడవుతోందని తమిళనాడు పోలీసు అధికారులను ఉటంకిస్తూ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. అలాగే.. మృతుల నుంచి సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని.. వాటి ఆధారంగా మరింత మంది కూలీలను పట్టుకోవడానికి ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రయత్నించినట్లు తేలిందని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తమిళనాడు డీజీపీ అశోక్‌కుమార్ వివరించారు.
‘ఎన్‌కౌంటర్’ వివరాలేమిటి?
ఏప్రిల్ 7వ తేదీ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లో.. శ్రీవారిమెట్టుకు సమీపాన చీకటీగలకోన, సచ్చినోడిబండ ప్రాంతాల వద్ద దాదాపు ఒకే సమయంలో రెండు ‘ఎన్‌కౌంటర్లు’ జరిగాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మంది కూలీలు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు.
ఆ రాత్రి వరకూ తిరుపతి పరిసరాల్లోనే..
తమిళనాడులో తిరువణ్నామలై జిల్లా పెదవీడుకు చెందిన పెరుమాళ్.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 11.14 గంటలకు తన సొంత ఊర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం 2.37 గంటలకు వేలూరు జిల్లా ఆర్కాట్‌లో ఉన్నారు. రాత్రి 7.44 గంటల నుంచి 9.22 వరకూ పెరుమాళ్ వడమాలపేట నుంచి రేణిగుంట మీదుగా తిరుపతికి సమీపంలోని నందవరం గ్రామానికి చేరినట్లు తెలుస్తోంది. మళ్లీ 7వ తేదీ తెల్లవారు జాము 2.33 గంటలకు పెరుమాళ్ సెల్‌ఫోన్ నుంచి ఆయన పక్కిళ్లలోని వారికి ఎస్‌ఎంఎస్ పంపారు. తిరిగి 2.35కు ఒకసారి, 2.36కు మరోసారి పొరుగింటి వెంకటేష్‌కు రెండుసార్లు పెరుమాళ్ సెల్‌ఫోన్ నుంచి కాల్స్ వెళ్లాయి. అలాగే.. తిరువణ్నామలై జిల్లా కన్నమంగళంకు సమీపంలోని కాళసముత్రిరం గ్రామానికి చెందిన పళణి భార్య లోగనాయగి చెప్పిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 6న మధ్యాహ్నం పళణి ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రం 6.24కి తిరుత్తణికి చేరుకున్నారు. రాత్రి 9.40 సమయంలో ఎన్‌కౌంటర్ ఘటనాస్థలికి 29 కిలోమీటర్ల దూరంలోని రేణిగుంటలో పళణి ఉన్నట్లు సీడీఆర్‌లో తేలింది. మళ్లీ ఏప్రిల్ 7న తెల్లవారుజాము 2.22 గంటలకు పళణి, పెరుమాళ్‌లు ఎన్‌కౌంటర్ స్థలంలో ఉన్నట్లు సీడీఆర్‌లు వెల్లడించాయి. తిరువణ్నామలై జిల్లా కన్నమంగళంకు సమీపంలోని గాంధీనగర్‌కు చెందిన మగేంద్రన్ ఏప్రిల్ 6న మధ్యాహ్నం తన సొంతూరు నుంచి బయలుదేరారు. 2.18 గంటలకు ఆర్కాట్‌కు చేరుకున్నారు. 42 నిమిషాల తర్వాత తిరుత్తణికి బయలుదేరారు. సాయంత్రం 5.19కి తిరుత్తణికి చేరుకున్నారు.
వాంగ్మూలాలతో కాల్‌డేటా సరిపోలుతోంది
ఎన్‌కౌంటర్ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన ముగ్గురు వ్యక్తులు ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం ఎదుట సాక్ష్యమిచ్చారు. ఇప్పుడు వెలుగులోకొచ్చిన మృతుల కాల్‌డేటా వారు చెప్పిన వివరాలతో సరిపోలుతోంది. ఈ కేసు దర్యాప్తులో కాల్‌డేటా కీలకం కానుంది. కూలీలను అదుపులోకి తీసుకున్నాక పోలీసులూ కూలీల ఫోన్లనుంచే వారి కుటుంబీకులకు కాల్స్ చేశారు. ఏపీలోకి ప్రవేశించగానే కూలీలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది. ఈ అంశాలను ఏపీ హైకోర్టు ముందుకూ తీసుకువెళ్తాం.
- హెన్రీ టొమాంగో, పీపుల్స్ వాచ్ సంస్థ ప్రతినిధి, మధురై