సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం(ఐహెచ్‌ఎస్‌ఎల్)లో పనిచేసిన కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.20 కోట్లు కూలీ డబ్బులు చెల్లించాలి. 2007 నుంచి ఇప్పటివరకు డబ్బుల చెల్లింపు సక్రమంగా జరగకపోవడంలో పనిచేసిన కూలీలు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ స్మార్ట్ కార్డ్ ఏజెన్సీలు కూడా ముఖం చాటేస్తున్నాయి. జనవరి రెండో తేదీలోగా చెల్లింపులు జరపని ఏజెన్సీలపై కేసులు నమోదు చేయనున్నారు.
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ నిర్మాణ పనిలో పాల్గొనే లబ్ధిదారు లేదా కూలీలకు డబ్బులు చెల్లించాలనే నిబంధన విధించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణ వ్యయం రూ.9,100 కాగా, ఇందులో కూలీలకు రూ.2,235 చెల్లించాల్సి వుంటుంది. పని చేసిన 15 రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. లేనిపక్షంలో కూలీలు అధికారులపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది.
అయితే జిల్లాలో 2007 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1.20 కోట్ల మేర కూలీ డబ్బుల చెల్లింపు నిలిచిపోయింది. కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం సమీక్ష జరిపిన నాథుడు కూడా లేకపోవడంతో ఏళ్ల తరబడి డబ్బుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అనామతు ఖాతా(సస్పెండెడ్ అకౌంట్)లో ఉన్న డబ్బును కూలీలకు అందజేయాల్సిన ఈజీఎస్ అధికారులు సమస్య పరిష్కరించే దిశలో ప్రయత్నించిన దాఖలా లేదు. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు జిల్లాలో ఫినో, జీరోమాస్, ఏపీ ఆన్‌లైన్ అనే స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీల ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. కూలీల వివరాలను బయోమాస్ పద్ధతిలో నమోదు చేసి, వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. జిల్లాలో ఏడు వేలకు పైగా కూలీలకు సంబంధించిన డబ్బులు ప్రస్తుతం అనామిక ఖాతాలో వున్నాయి. వీరిని బయోమాస్ పద్ధతిలో నమోదు చేయాల్సిన ఏజెన్సీలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. వలసలు, మరణాలు తదితరాలను సాకుగా చూపుతూ ఏళ్ల తరబడి కూలీ డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవడం లేదు.
కొరవడిన సమన్వయం
ఈజీఎస్ అధికారులు, స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీల నడుమ సమన్వయం కొర వడటంతో బయోమాస్ పద్ధతిలో వివరాలు నమోదు కావడం లేదు. జాయింట్ కలెక్టర్ శరత్ ఇటీవల జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీగా అదనపు బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. సుమారు 3,400 కూలీల వివరాలు నమోదు చేసి ఖాతాలు తెరిచినట్లు స్మార్ట్‌కార్డ్ ఏజెన్సీలు లెక్కలు చూపుతున్నాయి. జనవరి రెండో తేదీ లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకంలో పనిచేసిన కూలీలకు డబ్బులు చెల్లించాల్సిందిగా జేసీ శరత్ గడువు విధించారు. ఏపీ ఆన్‌లైన్ మినహా జీరోమాస్, ఫినో ఏజెన్సీలు మాత్రం ఇంకా బయోమాస్ పద్ధతిలో వివరాల నమోదు కూడా పూర్తి చేయలేదని సమాచారం.
క్రిమినల్ కేసులు:
నిర్దేశిత గడువులోగా కూలీలకు డబ్బు చెల్లించని ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. మండల స్థాయిలో లబ్ధిదారులను గుర్తించి తక్షణమే చెల్లింపులు పూర్తి చేయాలి. ఈ నెల 31న చెల్లింపులపై పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతాం. భవిష్యత్తులో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకం కింద మంజూరయ్యే పనులకు తక్షణమే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. -జేసీ శరత్