
విభజన రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంకెళ్తా: లగడపాటి
రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. సమాఖ్య సూత్రాలను, రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించేలా ఈ చర్య ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నపారని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే అది తప్పనిసరిగా వీగిపోతుందని రాజగోపాల్ అన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులు, మంత్రులు అందరూ తన నిర్ణయానికి మద్దతిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్లో చర్చించి ఒక వ్యూహం రూపొందిస్తారని లగడపాటి చెప్పారు. ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలంటే కచ్చితమైన నియమ నిబంధనలుండాలని చెబుతూ ఈ విషయంలో ఎస్ఆర్ బొమ్మై, కేంద్ర ప్రభుత్వాల మధ్య 1994లో జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలంటే కచ్చితమైన నిబంధనలు అందులో చెప్పారన్నారు.