నిబంధనలకు పాతర..ఇసుక జాతర
పెదపులిపాక క్వారీలోకి ప్రవేశిస్తున్న భారీ లారీలు
ప్రభుత్వ జీవో 95కు తూట్లు
చోద్యం చూస్నున్న అధికారులు
స్టాక్‌పాయింటే లేదు... ర్యాంపు నిరుపయోగం
పెదపులిపాక(పెనమలూరు) : తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం,అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెదపులిపాకలో ప్రభుత్వ నిబంధనల అమలుకు నోచుకోవడం లేదు. .ఇసుక క్వారీల్లోకి 3 క్యూబిక్ మీటర్లకు మించి లోడ్ ఉన్న వాహనాలను అనుమతించరాదని ప్రభుత్వ జీవో 95లో స్పష్టంగా ఉన్నా.... అధికారులు భారీ వాహనాలను అనుమతిస్తూనే ఉన్నారు. అలాగే ఇసుక లోతుగా తవ్వుతుండడంతో నదిలో పర్యావరణానికి, భూగర్భజలాలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఇసుకకు డిమాండ్ బాగా పెరగడంతో పెదపులిపాక ఇసుక క్వారీని ఇటీవలే ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించింది. అయితే ఈ క్వారీ ప్రారంభించిన ప్పటి నుంచి అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. పెద్ద వాహనాల ద్వారా ఇసుక తరలించాలంటే ఇసుక క్వారీ బయట స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేయాలి. అక్కడి నుంచి భారీ వాహనాల్లో గరిష్టంగా ఆరు క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక తరలించడానికి పర్మిట్లు ఇచ్చి అనుమతించాలి.
క్వారీలో ఏం జరుగుతోందంటే...
పెదపులిపాక ఇసుక క్వారీలో నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇక్కడ తెలుగు తమ్ముళ్ల హడావిడి విపరీతంగా ఉండటంతో ఆడిందే ఆట పాడిందే పాటగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యావరణం, భూగర్భ జలాలు, జీవోలోని నిబంధనలు పట్టించుకోకుండా అడ్డగోలుగా ఇసుక క్వారీయింగ్ చేస్నున్నారు. ప్రతి రోజు వంద లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలు కూడా నదీ ప్రవాహానికంటే లోతుగా జరుగుతున్నాయి. క్వారీకి అతి సమీపంలో 10 ఎంజీడీ తాగునీరు సంప్ కూడా ఉంది. దానిని సైతం పట్టించుకోకుండా క్వారియింగ్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
స్టాక్ పాయింట్ ఏదీ..?
ఈ క్వారీకి స్టాక్‌పాయింట్ ఏర్పాటు చేయాలని గతంలో పరిశీలిలనకు వచ్చిన కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసే భారీ వాహనాలు నదిలోకి వెళ్లకుండా స్టాక్‌పాయింట్ వద్ద నుంచి మాత్రమే ఇసుక తరలించాల్సి ఉంది. అయితే తమ్ముళ్ల ఒత్తిడి మేరకు స్టాక్‌పాయింట్ పెట్టకుండా లారీలను నేరుగా నదిలోకి తీసుకు వెళుతున్నారు.దీంతో ఇక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడడమే కాకుండా... లారీల కోసం పనికిరాని ర్యాంప్ నిర్మాణం చేసి నిధులు మట్టిపాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతా...
ఈ విషయమై సెర్ఫ్ కో-ఆర్డినేటర్ మరియబాబును వివరణ కోరగా క్వారీలోకి భారీ వాహనాలు వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతానని ఆయన చెప్పారు.