విజయవాడ: విజయవాడ భవానీపురంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ బీభత్సం సృష్టించింది. బ్రేక్ డౌన్ అయిన లారీని స్టార్ట్ చేసే క్రమంలో అదుపుతప్పి పుట్‌పాత్ పైకి దూసుకెళ్లింది. దీంతో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయవాడ నగరంలో భవానిపురంలో రావిచెట్టు సెంటర్ వద్ద శనివారం తెల్లవారు జామున 2 గంటలకు జరిగింది. వివరాలు.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్క్రాఫ్ లోడుతో వెళ్తున్న లారీ భవానిపురం రావిచెట్టు సెంటర్ వద్దకు రాగానే బ్రేక్ డౌన్ అయింది.
రోడ్డుపై ఉన్న లారీని తొలగించడానికి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో క్రేన్ డ్రైవర్(హోంగార్డు), లారీ డ్రైవరు, క్లీనర్‌ను లారీని తోయమని కోరి తాను లారీని స్టార్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు లారీని హోంగార్డు అదుపుచేయలేకపోమడంతో అదుపుతప్పి పుట్‌పాత్ పైకి దూసుకుపోయింది. దీంతో పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న గుర్తు తెలియని బిచ్చగాళ్లు పురుషుడు(55), ఒక మహిళ(50) మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదే హలను పోస్ట్‌మార్టం కోసం జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.