తిమ్మాపూర్, న్యూస్‌లైన్ : తిమ్మాపూర్ మండలంలో అక్రమ లే అవుట్ల దందా జోరుగా సాగుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో సామాన్యులు భూమిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. నగర శివారు ప్రాంతాల్లో గుంట భూమికి రూ.20 లక్షలకు పైగా ధర పలుకుతోంది. ప్రధాన సెంటర్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యులకు అందుబాటులో లేనివిధంగా భూముల ధరలు ఉండడంతో తిమ్మాపూర్ మండలంలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టారు.
ఇక్కడ నగర వాసులతోపాటు దూరప్రాంతాల వారుసైతం ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న అల్గునూర్, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ, ఇందిరానగర్, నుస్తులాపూర్, కొత్తపల్లి, రేణికుంటతోపాటు లోపలికి ఉన్న మన్నెంపల్లి, నల్లగొండ గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఐదారేళ్ల క్రితం ఎకరానికి రూ.20 లక్షలు పలికిన ధరలు ఇప్పుడు రూ.కోటికి పైగా పెరిగిపోయాయి. అల్గునూర్, తిమ్మాపూర్, రామకృష్ణకాలనీ గ్రామాల్లో ఎకరానికి రూ.2కోట్ల వరకు ధర పలుకుతోంది. మొదట గుంటకు రూ.2లక్షలు పలికిన ధర ఇప్పుడు రూ.6లక్షల వరకు పెరిగిపోయింది. రామకృష్ణకాలనీలోని ఇంజినీరింగ్ కళాశాల ఎదుట రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న స్థలం గుంటకు రూ.13లక్షల వరకు ఉందంటే ఇక్కడ భూముల ధరలు ఎంత ఖరీదో ఊహించవచ్చు.
నిబంధనలకు తూట్లు...
వ్యవసాయ భూములను ప్లాట్లు చేసేందుకు ప్రభుత్వపరంగా నిబంధనలున్నాయి. వ్యవసా య భూమిని కమర్షియల్‌కు వాడుకోవడానికి రెవెన్యూ శాఖకు నాలాపన్ను చెల్లించాలి. ఎకరం భూమిలో ప్లాట్లు చేస్తే అందులో నాలుగు గుం టలు స్థానిక గ్రామపంచాయతీ పేర రిజిస్ట్రేషన్ చేయాలి. అందులో 33ఫీట్ల రోడ్లతో అన్ని మౌలి క వసతులు కల్పించాలి. ఎకరానికి రూ.12వేల వరకు లే అవుట్ ఫీజు, సెక్యురిటీ డిపాజిట్ చే యాలి. లే అవుట్ భూమి వరకు 33 ఫీట్ల అ ప్రోచ్ రోడ్లు ఉండాలి.
వీటన్నింటికి రియల్టర్లు తూట్లు పొడుస్తున్నారు. రామకృష్ణకాలనీలో అక్కడక్కడ 33 ఫీట్ల అప్రోచ్ రోడ్ మినహా ఎక్కడా ప్రభుత్వ నిబంధనలు పాటించిన దాఖ లాలు కానరావు. తిమ్మాపూర్‌లోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అక్రమ లే అవుట్ ప్లాట్లలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇవి గ్రామపంచాయతీ అనుమతి లేకుండా నిర్మిస్తున్నా రా... అనుమతి ఉంటే ఎలా ఇచ్చారనేది ప్రశ్న. అల్గునూర్‌లో అక్రమ లే అవుట్ల స్థలాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది హెచ్చరిక బోర్డులు పాత గా వాటిని రియల్టర్లు వెంటనే తొలగించేశారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి...
అక్రమ లే అవుట్ల దందాతో తమ జేబులు నిం పుకుంటున్న రియల్టర్లు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. మండలంలో మొత్తం 257.09 ఎకరాల్లో అక్రమ లే అవుట్ల దందా కొనసాగుతోంది. అత్యధికంగా రామకృష్ణకాలనీలో 93.07 ఎకరాల్లో ప్లాట్ల క్రయ విక్రయాలు సాగుతున్నాయి. ఇందిరానగర్‌లో 64 ఎకరాల్లో, తిమ్మాపూర్‌లో 44.15 ఎకరాల్లో, కొత్తపల్లిలో 3 ఎకరాల్లో, మన్నెంపల్లిలో 17.11 ఎకరాల్లో, నుస్తులాపూర్‌లో 4.07 ఎకరాల్లో, నల్లగొండలో 1.24 ఎకరాల్లో, రేణికుంటలో 28.25 ఎకరాల్లో, అల్గునూర్‌లో 18 ఎకరాల్లో అక్రమంగా లే అవుట్లు చేశారు.
ఇక్కడ ప్రైవేటు గా గుంటకు పలుకుతున్న ధరను ఎకరానికి చూపిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రియల్టర్లు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఆ ధరలనే చూపిస్తూ నాలాపన్ను చెల్లించి వ్యవసాయ భూములను కమర్షియల్‌గా అమ్మేసుకుంటున్నారు. గ్రామపంచాయతీకి ఎకరానికి నాలుగు గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉన్నా ఏ ఒక్కరూ ఒక్క గుంటను సైతం చేయలేదని రికార్డులు చెబుతున్నాయి. మండలంలో మొత్తం 257 ఎకరాల్లో 25 ఎకరాలు ఆయా గ్రామ పంచాయతీల పేర రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దీంతో గుంటకు సరాసరిగా రూ.4లక్షలు ధర ఉన్నా ప్రభుత్వానికి రూ.40 కోట్లు నష్టం స్పష్టంగా కనిపిస్తోంది.
లే అవుట్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ 257 ఎకరాలకు రూ.30.84 లక్షలు ప్రభుత్వానికి జమ కాలేదు. మిగతా మౌలిక వసతులు కల్పన అసలు కానరావడం లేదు. అటు రిజిస్ట్రేషన్లలో, ఇటు నాలాపన్నులో, 10 శాతం భూమి, ఫీజు, డిపాజిట్‌తో కలిపి మొత్తంగా రూ.50 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. సర్కారుకు ఇంత నష్టం జరుగుతున్నా పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావితీస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ లే అవుట్లపై కొరడా ఝులిపించాల్సిన అవసరముంది.
లే అవుట్లకు తూట్లు
Published Sun, Nov 10 2013 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement