వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎంతచెప్పినా విననందుకు...
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
గుమ్మఘట్ట : వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. అక్రమ సంబంధం మానుకోవాలని ఎంతచెప్పినా విననందుకు కర్రతో బాది మట్టుపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం కళ్యాణదుర్గం డీఎస్పీ అనీల్‌పులిపాటి విలేకర్ల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్మఘట్టకు చెందిన కురుబ తిప్పేస్వామి(22) అనే యువకుడు గత నెల 29న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 5న గ్రామ సమీపాన చెరువులో మృతదేహం బయటపడింది. ఈ హత్యకు గల కారణాలను రాయదుర్గం సీఐ భాస్కర్‌రెడ్డి, గుమ్మఘట్ట ఎస్‌ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం చాకచక్యంగా ఛేదించింది.
గ్రామానికి చెందిన కురుబ రామాంజినేయులు హత్య చేశాడని గుర్తించి, అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసు దర్యాప్తులో నిందితుడు రామాంజినేయులు వివరాలు బయట పెట్టాడు. రామాంజనేయులు సొంత తమ్ముడి భార్యతో మృతుడు వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఏడాదిగా ఈ తంతు సాగుతూ వచ్చింది. ఇటీవల మానుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మాట వినలేదు. గత నెల 29న తన మరదలితో ఫోన్‌లో సంభాషిస్తున్న విషయాన్ని చూసి జీర్ణించుకోలేకపోయాడు.
ఆ రాత్రికి వేరుశెనగ పొలానికి నీరు పెట్టేందుకు తిప్పేస్వామి ఒంటరిగా వెళ్లాడు. కాపుకాచి రాత్రి పది గంటలకు కర్రతో నెత్తిన చితకబాది చంపేశాడు. అనుమానం రాకుండా మృతుడి శవాన్ని సమీపాన ఉన్న చెరువు నీటిలో పడేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా తానే నిందితుడినని తేలడంతో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు కురుబ రామాంజినేయులును ఈ నెల 15న అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో స్టేషన్‌హౌస్ ఆఫీసర్ రమణ తదితరులు పాల్గొన్నారు.