
ట్యాంకర్ బోల్తా: లీకవుతున్న గ్యాస్
విజయనగరం పట్టణంలోని ఆర్ అండ్ బీ జంక్షన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.
విజయనగరం: విజయనగరం పట్టణంలోని ఆర్ అండ్ బీ జంక్షన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో ట్యాంకర్ నుంచి ఎల్పీజీ గ్యాస్ లీకేజీ అవుతుంది. గ్యాస్ లీకవుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతూ... పోలీసులకు సమాచారం అందించిరు. పోలీసులు ఆర్ అండ్ బీ జంక్షన్ వద్దకు చేరుకుని ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకుండా ప్రయత్నాలు చేపట్టారు.
అయినా లీకేజీ ఆగడం లేదు. దాంతో గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్పీసీఎల్ అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. దాంతో హెచ్పీసీఎల్ అధికారులు గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు సిబ్బందిని హుటాహుటిన విజయనగరం పంపించారు. విశాఖపట్నం నుంచి ట్యాంకర్ రాయ్పూర్ వెళ్తుండగా ఆ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకవుతండటంతో ముందస్తు జాగ్రత్తగా ఆర్ అండ్ బీ జంక్షన్ పరిసర ప్రాంతాలలోని నివాసాల నుంచి ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు.