ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు
వైఎస్‌ఆర్ జిల్లా, మైదుకూరు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర 300 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభకు సురేష్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2014 ఎన్నికల్లో అమలు చేయలేని హామీలను ఇవ్వబోమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం వల్లే ఎన్నికల్లో ఓటమి చెందారన్నారు. చంద్రబాబు లాగా అలవిగాని హామీలు ఇచ్చి ఉంటే జగనే ముఖ్యమంత్రి అయి ఉండేవారన్నారు. రైతుల రుణమాఫీ సాధ్యం కాదని ఆనాడే జగన్ చెప్పారని, అయితే చంద్రబాబు రైతులకు రుణమాఫీపై హామీ ఇచ్చి ఇంత వరకు నెరవేర్చకుండా రైతులను మోసం చేశారని ఆరోపించారు. జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ రైతులకు మేలు చేసిన నాయకుడు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని సురేష్‌బాబు పేర్కొన్నారు. రాజోలి ఆనకట్టను 11వేలు క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత రాజశేఖరరెడ్డిదేనన్నారు. ఆ సమయంలో కోస్తాంధ్ర ప్రాంత నాయకులు రాజశేఖరరెడ్డి నిర్ణయంపై ఆక్రోశించినా ఆయన నన్ను అభిమానిస్తున్న నా జిల్లాకు మేలు చేయాల్సిందేనని పట్టుబట్టి రాజోలి ఆనకట్ట సామర్థ్యం పెంపు పథకానికి రూపకల్పన చేశారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు మూడు నెలల్లో శంకుస్థాపన చేస్తామని మంగళవారం కడప పర్యటనలో ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయనవి చిత్తశుద్ధి లేని ఆలోచనలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాచనూరు చంద్ర, కౌన్సిలర్ చెంచురామయ్యలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాష్ట్రంలో దుష్ట పరిపాలన– కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా
రాష్ట్రంలో దుష్ట పాలన సాగుతోందని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా విమర్శించారు. నెరవేర్చలేని హామీలను చంద్రబాబు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 70 శాతం రైతులు ఉన్నారని, అందరికి అన్నం పెట్టే రైతులను రుణమాఫీ చేయకుండా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని, ఒక్కరికి కూడా ఇవ్వకపోగా కుమారుడికి మంత్రి పదవిని కట్టబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో కోటి మంది నిరుద్యోగులు ఉండగా కేవలం లక్షా 80వేల మందికి మాత్రమే నిరుద్యోగ భృతి ప్రకటించారని, దానిని ఇచ్చేందుకు కూడా ఎన్నో అడ్డంకులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని అంజాద్ బాషా పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి సాగించిన సంక్షేమ ప్రభుత్వాన్ని మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అందించగలరనే మనో ధైర్యాన్ని ప్రజల్లో కలిగించేందుకే ఏడాదిగా కుటుంబానికి దూరంగా ఉంటూ వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో కేసీ కాలువ, తెలుగుగంగలకు సాగు నీటి కోసం రఘురామిరెడ్డి పోరాటాలు చేసి సాధించారన్నారు.
బాబు ప్రభుత్వంలో పెచ్చుమీరిన దోపిడీ–ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దోపిడీ పెరిగిపోయిందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆరోపించారు. పారిశ్రామిక వేత్తలను ఎమ్మెల్యే, ఎంపీలుగా చేసి వేల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలో ముఖ్యమంత్రి చూపుతున్నారని విమర్శించారు. ఆ పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బ్యాంకులకు రూ.6వేలు కోట్లు ఎగ్గొట్టారంటే పరిపాలన ఏవిధంగా ఉందో ప్రజలు గమనించాలన్నారు. ఏ ప్రభుత్వ పథకం కూడా జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే అందేలా ఉందని, అది కూడా పచ్చ చొక్కాల వారికి మాత్రమే లబ్ధి చేకూరుతోందన్నారు. బడుగు, బలహీన వర్గాలను విస్మరించి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రూ.కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ఆ డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని పాలించే శక్తి వైఎస్ కుటుంబానికే ఉంది– మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి
రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఒక్క వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉందని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. దానిని ఏ శక్తి ఆపలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు అవిశ్రాంతంగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావంగా మైదుకూరులో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సి.నాగార్జునరెడ్డి, కల్లూరు నాగేంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి లెక్కల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment