
ఆయన మన మధ్య నుంచి దూరమై నేటికి తొమ్మిదేళ్లు.. కానీ ఇంకా మనందరి కళ్ల ముందే మెదులుతున్నారు.. ఆ రూపం, ఆ చిరునవ్వు అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.. పేదలను ఆదుకోవడానికి మనసుంటే చాలని నిరూపించారు.. లీడర్ అంటే ఇలా ఉండాలని ప్రతి రాజకీయ నాయకుడూ అనుకునేలా ఖ్యాతినార్జించారు.. ఆయన పథకాల పట్ల సర్వత్రా ప్రశంసలే.. ఎంతగా అంటే ఖండాంతరాలు దాటేంతగా..
అందుకే ఆయన ఇక లేరన్న వార్త వినగానే ఎన్నో గుండెలు ఆగిపోయాయి.. మరెన్నో గుండెలు తమ ఇంట్లో వ్యక్తిని కోల్పోయినంతగా తల్లడిల్లాయి.. తొమ్మిదేళ్లుగా ఆయన సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతీ గుండె ఆ మహానేత మళ్లీ రావాలని ఆకాంక్షిస్తోంది...
నాయకుడంటే ఎలా ఉండాలి అనేదానిపై ప్రపంచంలో పలువురు ప్రముఖులు అనేక నిర్వచనాలు ఇచ్చారు..అనేక సూత్రీకరణలు చేశారు.. తెలుగునేలపై ఈ నిర్వచనాలన్నిటికీ ఒక లీడర్ అచ్చుగుద్దినట్లు సరిపోయాడు..లీడర్‌షిప్‌కే రోల్ మోడల్‌గా నిలిచాడు.. ఆయన మాట ఇస్తే అది శిలాశాసనమే.. హరిహరాదులు ఏకమైనా అది నెరవేరితీరాల్సిందే.. జీవితకాలంలో మాటతప్పడం కానీ.. మడమ తిప్పడం కానీ లేనేలేవు.. అన్నార్తులకు, అభాగ్యులకు మేలు చేయడానికి అహరహం తపించాడు... ఎన్ని ఆటంకాలు, పరిమితులు ఎదురైనా అనుకున్నది చేసిచూపించాడు..పేదలను ఆదుకోవడానికి ఏ నిబంధనా అడ్డురాకూడదని పరితపించాడు. అందుకే ఆయన మహానాయకుడయ్యాడు..ఆయనకు జనమే తమ గుండెల్లో గుడికట్టి పూజిస్తున్నారు..ఆయన జ్ఞాపకాలను మదిలో పదిలంగా పొదువుకున్నారు..ఆయన మరెవరో కాదు దివంగత ముఖ్యమంత్రి ఎడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి.. జనం గుండెలోతుల్లో కొలువైన మహానేత వైఎస్‌ఆర్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్ పాలించింది ఐదేళ్ల మూడునెలలు... కానీ వందేళ్లకు సరిపడనన్ని విజయాలు సాధించారు. అన్ని రంగాలలోనూ తనదైన ముద్ర వేశారు. విజన్‌లు ప్రకటించకపోయినా అనేక తరాలపాటు రాష్ట్రం, ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు అవసరమైన అనేక చర్యలు చేపట్టారు.. విజనరీగా నిరూపించుకున్నారు.. విధి వక్రించకుండా ఉండి ఉంటే.. ఆయనే ఉండి ఉంటే.. ఈ పరిణామం ఇలా చోటుచేసుకునేది కాదు అని ఇప్పటికీ అందరూ పదేపదే గుర్తుచేసుకోవడం వైఎస్‌ఆర్ ఎంతటి మహానాయకుడో తెలియజేస్తుంది.
హృదయాంతరాల్లోంచి వచ్చిన మాటే ‘మహానేత’
వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాదిమంది తనువులు చాలిస్తుంటే.. కోట్లాదిమంది శోకతప్త హృదయాలతో తల్లడిల్లిపోయారు.. తమకు, తమ కుటుంబాలకు ఆయన చేసిన మేళ్లను తలుచుకుని కుమిలిపోయారు. ఆ ‘మహానాయకుడి’ మరణాన్ని తట్టుకోలేక గుండెలవిసేలా రోధించారు... అలా రోధించే హృదయాలే ఆయనను ‘మహానేత’ అని పిలిచాయి. వారి హృదయాంతరాళాల్లోంచి స్పాంటేనియస్‌గా పుట్టుకొచ్చిన మాటే ‘మహానేత’.
మహానాయకుడి అడుగుజాడలు..
ఎంతకాలం బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యమని వైఎస్ తరచూ అనేవారు. ప్రతి పేదవాడి మోములో చిరునవ్వు చూడాలన్న తపన, అన్ని వర్గాలకూ మేలు చేయాలన్న ఆకాంక్ష, పేదరికాన్ని సమూలంగా అంతరింపజేయాలన్న కసి, అనితర సాధ్యమైన దార్శనికత, మంచిని తలపెట్టిన తర్వాత ఇక దేనికీ తలవంచని తత్వం, స్వపర బేధాలకు తావివ్వని సౌజన్యశీలత, అసాధ్యమని అందరూ ఆక్షేపించిన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి చూపడం, సాహసోపేత నిర్ణయాలను కూడా శరవేగంగా తీసుకోవడం, అద్భుతమైన అభివృద్ధి గణాంకాలు.. విలక్షణమైన, విశిష్టమైన వ్యక్తిత్వం.. ఇవీ వైఎస్‌ఆర్‌ను మిగిలిన నాయకులకు భిన్నమైనవాడిగా.. మహానాయకుడిగా నిలిపాయి.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సాహసి..
కుల, మత, ప్రాంత, జాతి పరభేదాలు పట్టించుకోకుండా, పార్టీలకతీతంగా సంతృప్త స్థాయిలో అందరికీ అందేలా సంక్షేమ పథకాలను అమలు చేసిన తీరు ప్రజలందరికీ వైఎస్‌ను దగ్గర చేసింది. వైఎస్ పాలనలో లబ్ధి పొందని వృత్తిగానీ, వ్యక్తిగానీ, వర్గంగానీ ఏదీ లేదు. అట్టడుగు వర్గాలను ఆయన పట్టించుకున్నట్టుగా మరో ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర పథకాన్ని అంతకుముందు ఏ ముఖ్యమంత్రీ ఆలోచించి అమలుచేయలేకపోయారు. రైతుల జీవితాలలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఉచిత విద్యుత్ వంటి పథకం అసాధ్యమనే అందరూ చెప్పినా సుసాధ్యం చేసిన ఘనత వైఎస్ సొంతం.
పేద విద్యార్థులకు పెద్ద చదువులు అంతకుముందు కలలోనైనా ఊహించని విషయం. ‘చదువుకోవడమే మీ బాధ్యత.. ఫీజులు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత’ అనే కొత్త నిర్వచనం చెప్పారు.. పెన్షన్ల పెంపుదల, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, కిలో రెండు రూపాయల బియ్యం, పావలావడ్డీకి రుణాలు , 108, 104... ఇలాంటి పథకాలను సాహసోపేతంగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరూ లేరు. వైఎస్ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు వ్యవసాయాన్ని పండగ చేశాయి. మొత్తం బడ్జెట్ లక్షకోట్లు లేని సమయంలో కూడా లక్షకోట్లతో 87 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలన్న ఆలోచన చేయడం మరెవరికైనా సాధ్యమేనా?.. రైతాంగం పట్ల ఆయనకున్న తపన ఆయనను అలా పురికొల్పిందేమో.. కోటి ఎకరాలను సాగునీరందించాలన్న పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఎంత గుండె కావాలి? ఎంత పెద్దమనసుండాలి? అందుకే ఆయన మహానేతగా మన్ననలందుకున్నారు.
ప్రతి అడుగులోనూ పేదలపై మమకారం..
వైఎస్‌ఆర్ అత్యంత విలక్షణమైన, విశిష్టమైన, అరుదైన రాజకీయవేత్త అని ఆయనను దగ్గరగా గమనించిన నాయకులంటుంటారు. ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలతో సంబంధాలు కొనసాగించడం ద్వారా సమకాలీన రాజకీయనాయకులకంటే భిన్నంగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను రూపొందించిన పథకాలు, ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి తాను తీసుకున్న కార్యాచరణ ఆయన్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకునే ప్రత్యేక ధోరణి మిగిలిన నాయకులకు వైఎస్‌ను భిన్నంగా నిలిపింది. ప్రతి పంచాయతీలోనూ వైఎస్ పేరుపెట్టి పిలిచే నాయకులుండేవారు. వేలాదిమందిని పేరు పెట్టి పిలవగలిగేవారంటే ప్రజల పట్ల ఆయనకున్న మమకారం అర్ధం చేసుకోవచ్చు. స్వభావరీత్యా వచ్చిన లక్షణం కాకుంటే అదెలా సాధ్యమౌతుంది? అది ఒక్క వైఎస్‌ఆర్‌కే సాధ్యం.
ముఖ్యమంత్రి అంటే ఏసీ రూములకే పరిమితమని, ఎపుడోగానీ జిల్లా పర్యటించరని అనుకునే రోజుల్లో సీఎం ఆఫీసును గ్రామ సచివాలయంలా మార్చేశారు. సామాన్యులు కూడా సీఎంను కలుసుకుని తమ బాధలు చెప్పుకునే వేదికలా మార్చారు.. ప్రతినిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వందలాదిమందిని తెల్లవారు ఝామునుంచే కలిసిన తర్వాతే దినచర్య మొదలుపెట్టడం మరెవరికైనా సాధ్యమయ్యే పనేనా? అందుకే ఆయన మహానేత అయ్యారు. సీఎం సహాయనిధి నుంచి ఆరుగంటల్లోనే సాయం అందాలని, తాను ఎక్కడ ఉన్నా ఆ సాయం అందడంలో జాప్యం జరగరాదని వైఎస్ తీసుకున్న నిర్ణయం పేదల పట్ల ఆయన ఎంత నిబద్దతతో ఉండేవారో తెలుసుకునేందుకు అద్దం పడుతుంది. ఇలాంటివే ఆయనను మహానేతను చేశాయి. ఐదేళ్ల పదవీ కాలంలోనే ఒక నాయకుడు పేద బడుగు బలహీన వర్గాల జనజీవితంలో విప్లవాత్మకమైన, సమూలమైన మార్పులు తీసుకురాగలడా.. అది సాధ్యమేనా.. వంటి అనేక సందేహాలను పటాపంచలు చేసినందునే వైఎస్ మహానాయకుడయ్యాడు.