
లక్ష ఓట్ల మెజారిటీతో ‘చింతా’కు గుణపాఠం
హోం మంత్రి చిన్న రాజప్ప
భవానీనగర్‌లో రోడ్ షో
సుగుణమ్మను గెలిపించాలని విజ్ఞప్తి
తిరుపతి మంగళం: ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి మాజీ ఎంపీ చింతామోహన్‌కు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్పాలని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చిన్న రాజప్ప పిలుపునిచ్చారు. భవానీనగర్‌లో సోమవారం పార్టీ నాయకుడు మునిశేఖర్ ఆధ్వర్యంలో సోమవారం టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ, హోంమంత్రి చిన్న రాజప్ప రోడ్ షో నిర్వహించారు. నగర పరిధిలోని రాయల్‌నగర్‌లో టీ డీపీ వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్ళపల్లె సుధారాణి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న రాజప్ప మాట్లాడుతూ కేవలం చింతా మోహన్ స్వార్థం కోసమే ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.
ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మానవత్వంతో ఉపఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని కాంగ్రెస్ పోటీగా అభ్యర్థిని నిలబెట్టడం సిగ్గుచేటన్నారు. భర్త ఆశయాల కోసం ఎన్నిక ల్లో పోటీచేస్తున్న సుగుణమ్మను నగర ప్రజలు లక్ష ఓట్లు మెజారీటితో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మం త్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పీతల సుజాత మాట్లాడుతూ చింతా మోహన్ స్వార్ధం కోసం ఉప ఎన్నికల్లో పోటీ చేయిస్తూ పేదల సంక్షేమం కోసమే నిరంతరం తపించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడం దారుణమన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, కమలాపురం ఎమ్మెల్సీ పుట్టా నరసింహారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్‌యాదవ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.