జనభేరి విజయవంతం చేయండి
అనంతపురం అర్బన్, సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 15 నుంచి రెండ్రోజుల పాటు వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. జనభేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఎస్‌ఆర్‌ఐటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. మహానేత వైఎస్‌ఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరూ జనభేరిలో పాల్గొనాలన్నారు.
రాష్ట్ర విభజనకు టీడీపీ, కాంగ్రెస్‌లే కారణం
రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన ఏకైక నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. సీమాంధ్ర అభివృద్ధి చెందాలంటే దూరదృష్టి ఉన్న నాయకుడి అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే సత్తా వైఎస్ జగన్‌కు ఉందన్నారు. రాష్ట్ర ఆస్తులు, అప్పులను బ్యాలెన్స్ చేయడానికి మరో 15 ఏళ్లు పడుతుందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని, లంచాలకు రుచిమరిగారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అవినీతికి చిరుమానా అన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో బాబు చేసేందీమీ లేదన్నారు. సువర్ణపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. ‘మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైఎస్‌ఆర్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శించారు. చివరకు ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇవాళ జేసీ బ్రదర్స్, మరికొంత మంది నాయకులు వైఎస్ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. వీరందరికీ ప్రజలు తప్పకుండా శిక్ష వేస్తార’న్నారు.
సినిమా వాళ్లకు ఓటేసే పరిస్థితి పోయింది
‘ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. సినిమా వాళ్లకి ఓట్లేసే పరిస్థితి ఏమాత్రం లేదు. గతంలో హిందూపురం నుంచి ఎన్నికైన మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు, హరికృష్ణ ఆ ప్రాంతానికి కనీసం నీళ్లు తెప్పించారా?’ అని రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. మహానేత వైఎస్సార్ హయాంలో హిందూపురానికి నీళ్లొచ్చాయన్నారు. ఆ విషయం అక్కడి ప్రజలకే తెలుసన్నారు. ఇవాళ సినీనటుడు బాలకృష్ణను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం ఆ ప్రాంత వాసులను మభ్యపెట్టడమేనన్నారు. సినిమా చరిష్మాను అడ్డం పెట్టుకుని గెలిచే చాన్స్ లేదన్నారు. అక్కడ నవీన్ నిశ్చల్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, హిందూపురం, కదిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు వై వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, నవీన్‌నిశ్చల్, అత్తార్ చాంద్‌బాషా, వైఎస్సార్ సీపీ డీసీసీబీ అభ్యర్థి లింగాల శివశంకర్‌రెడ్డి, సీఈసీ సభ్యులు పైలా నరసింహయ్య, మధుసూదన్ రెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి, తోపుదుర్తి చందు, ఆలూరు సాంబశివారెడ్డి, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జ్ చుక్కలూరు దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.