విజయనగరం : రైలు కిందపడి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చివరి నిముషంలో పక్కకు తప్పుకోవడంతో రెండు కాళ్లు విరిగిన సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాడంగి మండలం కోడూరు గ్రామానికి చెందిన గిరిడి రామారావు(46) పదేళ్ల కిందట భార్యాపిల్లలతో బొబ్బిలి మండలం పెంట గ్రామానికి వలస వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో అదే గ్రామానికి చెందిన ఒక దుకాణదారుడితో గొడవ జరిగింది. ఆ విషయంలో దుకాణదారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇతన్ని కటకటాల వెనక్కి పంపారు. తాజాగా శనివారం కూడా దుకాణదారుడితో గొడవ జరగడంతో మనస్తాపం చెందిన రామారావు ఆదివారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామ శివారులోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకొని రైల్ ఇంజన్ కింద పడి చనిపోవాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలకపోవడంతో చివరి నిముషంలో వెనక్కి తగ్గాడు.
అయితే అప్పటికే అతని రెండు కాళ్ల పైనుంచి రైలు ఇంజన్ వెళ్లడంతో రెండు కాళ్లు తెగిపోయాయి. సంఘటన జరిగిన ప్రదేశం గ్రామానికి దూరంగా ఉండటంతో ఈ విషయం ప్రజలకు తెలిసేసరికి చాలా ఆలస్యం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు అప్పటికే అధికంగా రక్తస్రావం అయిన రామారావును 108 సాయంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇతని భార్య గతంలోనే చనిపోగా, కవల పిల్లలు(14) ఉన్నారు.
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రెండు కాళ్లు విరిగిన వైనం
Published Sun, Jul 5 2015 10:29 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM
Advertisement
Advertisement