సింగపూర్‌తో ‘చంద్ర’ బంధం | Management Company with the chandrababu binamies itself | Sakshi
Sakshi News home page

సింగపూర్‌తో ‘చంద్ర’ బంధం

Published Thu, May 4 2017 3:26 AM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM

సింగపూర్‌తో ‘చంద్ర’ బంధం - Sakshi

సింగపూర్‌తో ‘చంద్ర’ బంధం

న్యాయస్థానాలు ఆక్షేపించినా స్విస్‌ ఛాలెంజ్‌ వదలరు

- వేల కోట్ల ‘వాటా’ల కోసమే సింగపూర్‌ బాట
- రాజధాని ‘స్టార్టప్‌’లో బాబు అండ్‌ కో భారీ స్కెచ్‌
- 1691 ఎకరాల భూమి, రూ. 5,721 కోట్ల పెట్టుబడికి దక్కేది రూ. 372 కోట్లు
- రూ. 306 కోట్లు పెట్టుబడిపెట్టే సింగపూర్‌ కన్సార్టియంకు రూ. 52,439 కోట్లు లాభం
- అయినా సింగపూర్‌కే అప్పగిస్తూ కేబినెట్‌ నిర్ణయం
- బాబు బినామీలతోనే మేనేజ్‌మెంట్‌ కంపెనీ
- దానిని అడ్డుపెట్టుకుని భారీ దోపిడీకి పథకం


‘‘స్విస్‌ చాలెంజ్‌ విధానం పారదర్శకంగా లేదు. ఈ విధానంలో ఏయే ప్రాజెక్టులు చేపట్టనున్నారో అందరికీ తెలిసేలా పారదర్శకంగా ప్రభుత్వం అన్నీ ప్రకటించాలి. ప్రాజెక్టు వివరాలు ప్రభుత్వం ఎవరికీ ఇవ్వకూడదు. ఈ విధానంలో పాల్గొనే సంస్థలతో ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరపకూడదు.’’
– 11.05.2009న lఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

‘‘స్విస్‌ చాలెంజ్‌ విషయంలో ఎందుకీ లోగుట్టు? విదేశీ కంపెనీల కోసం నిర్ణయాలు తీసుకోవద్దు. రాజధాని ప్రజల ఆస్తి. మీ ఇష్టారా జ్యంగా వ్యవహరి స్తామంటే చెల్లదు. ఆదాయవ్యవ హారా లన్నీ బహిర్గతం చేయాల్సిందే. టెండర్‌ నోటిఫికేషన్‌లో పారదర్శకత ఎక్కడా లేదు. మీరు చెప్పేది కాగితాలపై ఒకటి ఉంటుంది. ఆచరణలో మరొకటి జరుగుతుంది.’’
– రాష్ట్ర ప్రభుత్వ తీరుపై 23.08.2016న హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు

‘‘సీఆర్‌డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదని, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడివున్న ఆదేశాలను పాటించడం తప్ప, తాము ఏమీ చేయలేమని ఆ సంస్థ ఉద్యోగులంటున్నారు.  కారణం లేకుండా మమ్మల్ని  తొలగించారు. తర్వాత లండన్‌కు చెందిన ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ను ఎంపిక చేశారు. కానీ ఎలా ఎంపిక చేసిందీ బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. దీన్ని బట్టి ఇక్కడ ఏదో లోపాయికారీ ఒప్పందం ప్రకారమే ఎంపికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.’’
– ఆర్కిటెక్చురల్‌ డైజెస్ట్‌ ఏప్రిల్‌ సంచికలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాకి  అసోసియేట్స్‌ ఫౌండర్‌ చైర్మన్‌ ఫుమిహికో కథనం

సాక్షి, అమరావతి: పత్రికలు, మేధావులు, రాజకీయనాయకులు, ప్రతిపక్షాలు పలుమార్లు ఇది తప్పు అని ఖండించినా.. న్యాయస్థానాలు పూర్తిగా ఎండగట్టినా.. కాస్త ఆలస్యమైతే చేశారు గానీ.. మళ్లీ అదే స్విస్‌ చాలెంజ్‌.. అవే సింగపూర్‌ కంపెనీలు.. అవే లోపాయికారీ ఒప్పందాలు.. అవే పద్ధతుల్లో.. ఎలాంటి జంకూగొంకూ లేకుండా రాజధాని స్టార్టప్‌ ప్రాజెక్టును కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూనుకున్నారు. వేల కోట్లు దుర్వినియోగం కాబోతున్నాయని.. అందులో భారీ వాటా దక్కించుకోబోతున్నారని చెప్పడానికి ఇదో పెద్ద ఉదాహరణ. అందుకే ఈ స్థాయిలో చంద్రబాబు ముందుకు పోతున్నారని, న్యాయస్థానాలు ఆక్షేపిస్తున్నా బరితెగించినట్లు వ్యవహరిస్తున్నారని విశ్లేషకులంటున్నారు.

రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో 1691 ఎకరాల భూమి ఇవ్వడంతోపాటు రూ.5,721.9 కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం పెడుతోంది. ఆ ప్రాజెక్టును సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగించింది. ఈ ప్రాజెక్టులో సింగపూర్‌ కన్సార్టియం రూ.306.4 కోట్లను పెట్టుబడి పెడుతోంది. రూ.5,721.9 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇస్తామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదిస్తే.. అంతకన్నా ఎక్కువ వాటా కోసం ప్రయత్నించాల్సింది పోయి 42 శాతమే చాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. అంటే రూ.306.4 కోట్ల పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కన్సార్టియంకు దక్కే వాటా 58 శాతం. దీనిని బట్టి అర్ధం కావడం లేదూ ‘వాటా’ల కోసమే ‘వాటాల’లో తేడా వచ్చిందని?

రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ 8.7శాతమట..
న్యాయస్థానాలు అనేకసార్లు మొట్టికాయలు వేశాక అంతిమంగా రాష్ట్రప్రభుత్వానికి వచ్చే లాభం గురించి చంద్రబాబు కేబినెట్‌ సమావేశంలో బయటపెట్టారు.  మొత్తం 1691 ఎకరాల స్టార్టప్‌ ఏరియాను 15 ఏళ్లలో మూడు దశల్లో అభివృద్ధి చేస్తారని, తొలి దశలో 656 ఎకరాలు, రెండో దశలో 514 ఎకరాలు, మూడో దశలో 521 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తారని కేబినెట్‌ సమావేశంలో వెల్లడించారు. ఇందులో సింగపూర్‌ కన్సార్టియం చేసేదేమీ లేదు. భూమి ఇచ్చి మౌలికసదుపాయాలకు రాష్ట్రప్రభుత్వమే రూ.5,500 కోట్లు ఖర్చుపెడితే ఆ భూమిలో రహదారులు, పార్కులు విడగొట్టి మిగిలిన 1070 ఎకరాల మేర భూమిని ప్లాట్లు చేసి అమ్ముకోవడమే మేనేజ్‌మెంట్‌కంపెనీ ముసుగులో సింగపూర్‌ కన్సార్టియం చేసేది. అలా అమ్మగా వచ్చే లాభాలలో మొదట దశలో 5శాతం, రెండో దశలో 7.5 శాతం, మూడో దశలో 12 శాతం రెవెన్యూ వాటాను రాష్ట్రప్రభుత్వానికి ఇస్తారు. మూడు దశల్లో కలిపితే ఇది 8.7 శాతం ఉంటుందని అంచనా. రాష్ట్రప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మిగిలిన మొత్తాన్నంతా ఏడీపీలోని సింగపూర్‌ కన్సార్టియం, సీసీడీఎంసీఎల్‌ 58ః42 నిష్పత్తిలో పంచుకుంటాయి.

రూ.5721.9 కోట్ల పెట్టుబడికి వచ్చేది రూ.372.36 కోట్లే!
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు అమలు కోసం సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సీసీడీఎంసీఎల్‌) కలసి అమరావతి డెవలప్‌మెంట్‌ పార్టనర్‌ (ఏడీపీ)ని ఏర్పాటుచేశాయి.
► రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ముసుగులో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి లాక్కున్న సర్కార్‌ 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్‌ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను సర్కార్‌ కల్పించనుంది.
► రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని సింగపూర్‌ సంస్థలు ప్రాథమికంగా అంచనా వేశాయి. ఇందులో తమ వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లనీ.. మిగతా రూ.2618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణం రూపంలోనూ ప్లాట్లు విక్రయం ద్వారా వచ్చే మొత్తాన్ని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు కోసం ఖర్చు చేస్తామని సింగపూర్‌ సంస్థలు చేసిన ప్రతిపాదనకు సర్కార్‌ అంగీకరించింది.
► ఈ ప్రాజెక్టులో రూ.5,721.9 కోట్లు ఖర్చు చేసే రాష్ట్రప్రభుత్వానిది 42 శాతం వాటా కాగా.. కేవలం రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్‌ కన్సార్టియంది 58 శాతం కావడం గమనార్హం.
► రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును తాము నియమించే మేనేజ్‌మెంట్‌ కంపెనీకే ఏడీపీ అప్పగించాలన్న సింగపూర్‌ సంస్థల ప్రతిపాదనకూ సర్కార్‌ అంగీకరించింది. ఈ మేనేజ్‌మెంట్‌ కంపెనీ స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు.. ప్లాట్లను విక్రయిస్తుంది.
► స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో రహదారులు, పార్కులకు పోగా మిగిలిన 1,070 ఎకరాలను ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. అంటే.. ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్‌ రెవెన్యూ షేర్‌లో తొలి దశలో 5, రెండో దశలో 7.5, మూడో దశలో 12 అంటే సగటున 8.7 శాతం వాటా ఇస్తే ప్రభుత్వానికి దక్కేది రూ.372.36 కోట్లే. ఏడీపీకి దక్కేది రూ.3907.64 కోట్లు.
► ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లును కలిపితే రూ.4,907.64 కోట్లు వస్తుంది. అయితే మేనేజ్‌ మెంట్‌ కంపెనీ ఖర్చులతో పాటు రాజధాని స్టార్టప్‌ ఏరి యా ప్రాజెక్టు వ్యయం రూ.3,137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్‌ సంస్థలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి.   

మేనేజ్‌మెంట్‌ కంపెనీ ముసుగులో దోపిడీ పథకం
రాజధాని స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును తాము నియమించే మేనేజ్‌మెంట్‌ కంపెనీకే ఏడీపీ అప్పగించాలన్న సింగపూర్‌ సంస్థల ప్రతిపాదనకూ సర్కార్‌ అంగీకరించింది. ఈ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఏదన్నది స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుకు సింగపూర్‌ సంస్థల ప్రతిపాదనల్లో వెల్లడించకపోవడం గమనార్హం. ఆ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ముఖ్యనేత బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఈ మేనేజ్‌మెంట్‌ కంపెనీ స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటు.. ప్లాట్లను విక్రయిస్తుంది. ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్‌మెంట్‌ కంపెనీకి చెల్లించాలి.

ఒకవేళ అధిక ధరకు అమ్ముకున్నా అడిగే నాధుడులేడు. ఆ లాభాలను సింగపూర్‌ సంస్థలే పంచుకుంటాయి. రాష్ట్రానికి దక్కేదేమీ ఉండదు. మేనేజ్‌మెంట్‌ కంపెనీని అడ్డుపెట్టుకుని రూ.4 కోట్లకు ఎకరం చొప్పున భూమిని కొట్టేసేందుకు చంద్రబాబు అండ్‌ కో, సింగపూర్‌ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి. విజయవాడలో ప్రధాన కేంద్రాల్లో గజం భూమి రూ.లక్ష పలుకుతోంది. ఈ లెక్కన రాజధానిలో ప్రాంతంలోనూ అదే ధర పలుకుతుందనుకుంటే.. ఎకరం భూమి రూ.40 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన 1,070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను ముఖ్యనేత,  సింగపూర్‌ సంస్థలు సొమ్ము చేసుకోనున్నాయి.

తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్‌ సంస్థలకు అప్పగించడానికి సర్కార్‌ అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.పది వేల కోట్లు ఆ సంస్థలకు ఆదాయం వస్తుంది. ఇందులో ఒక్క పైసా కూడా వాటా ఇవ్వమని ఆ సంస్థలు పెట్టిన షరతుకూ సర్కార్‌ అంగీకరించింది. అంటే.. సింగపూర్‌ సంస్థలు పెట్టే రూ.306.4 కోట్ల పెట్టుబడికి ఆదిలోనే రూ.9,693.60 కోట్ల లాభం దక్కించుకోనున్నాయి. మొత్తమ్మీద స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టులోనే కనిష్ఠంగా రూ.52,439.6 కోట్లను ముఖ్యనేత, సింగపూర్‌ సంస్థలు కాజేయనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement