మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో విలువైన గ్రానైట్ రాయి ఆక్రమణకు గురవుతోంది. క్వారీలకు అనుమతి తీసుకున్న యజమానులు హద్దులు అతిక్రమించి కోట్లాది రూపాయల విలువైన రాయి కొల్లగొడుతున్నారు. అధికారులు గుర్తించి జరిమానా విధించినా పట్టించుకోకుండా పర్మిట్ల కోసం ఓ రాష్ట్ర మంత్రి, మరో కేంద్ర మంత్రి సాయంతో పైరవీలు చేస్తున్నారు. - న్యూస్‌లైన్, మానకొండూర్
మానకొండూర్, న్యూస్‌లైన్ : మానకొండూర్ నియోజకవర్గంలో గ్రానైట్ క్వారీల యజమానులు తమ కు అనుమతి ఉన్న ప్రదేశానికి మించి రాయి తీస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్ విజిలెన్స్ అధికారులు సర్వే చేసి రెండు క్వారీలు ఆక్రమణకు పాల్పడింది వాస్తవమేనని తేల్చారు. నివేదికలు ఉన్నతాధికారులకు అందించారు. శంకరపట్నం మండలం మొలంగూరులోని 906 సర్వేనంబరులో క్వారీ అనుమతికి ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోవడంతో నాలుగు హెక్టార్లకు 2010లో అనుమతి ఇచ్చారు. సాయినాథ్ గ్రానైట్స్ కంపెనీ పేరిట అనుమతి లభించింది.
కానీ, హద్దులు దాటి రాయి తీసుకెళ్లారు. 2011లోనే ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు రాగా, సర్వే చేసిన అధికారులు ఆక్రమణ జరగలేదని తేల్చారు. పక్కనే మరో క్వారీ కోసం లీజుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఈ ఏడాది మార్చి లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. మైనింగ్, విజిలెన్స్ అధికారులు అక్టోబర్ 4న సర్వే చేసి 18 వందల క్యూబిక్ మీటర్లకు పైగా గ్రానైట్ రాయి ఆక్రమణకు గురైందని తేల్చారు. దీని విలువ రూ.32 లక్షలు ఉంటుంది. మైనింగ్ నిబంధనల ప్రకారం... అక్రమంగా ఎంత తవ్వితే అంతకు 10 రెట్లు జరిమానా విధిస్తారు. ఈ మేరకు రూ.32 లక్షల విలువైన రాయి అక్రమంగా తీసినందుకు ఈ విలువతోపాటు జరిమానా మొత్తం కలిసి రూ.3.50 కోట్లు అవుతుందని తేల్చారు.
నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారులు తెలి పారు. మానకొండూర్ మండలం లలితాపూర్‌లో 99 సర్వే నంబరు లో పత్తిగుట్టపై గ్రానైట్ క్వారీ పనులు 2006లో ప్రారంభమయ్యాయి. కొద్దిరోజులకే పనులు నిలిచిపోయాయి. మళ్లీ 2012 నుంచి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పత్తిగుట్ట రెండు గ్రామాల సరిహద్దులో ఉంది. ఒమెగా గ్రానైట్ కంపెనీ ఈ క్వారీ నిర్వహిస్తోంది. క్వారీ నిర్వహిస్తున్న యజమాని హద్దులు దాటి గ్రానైట్‌ను తీసి ఆక్రమణకు పాల్పడ్డారు. లలితాపూర్‌కు చెందిన వెల్మారెడ్డి మైనింగ్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వే చేసిన మైనింగ్ విజిలెన్స్ అధికారులు 336 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ఆక్రమణకు గురైందని గుర్తించారు. దీని విలువ రూ.5.79 లక్షలు ఉంటుం దని తేల్చారు.
దీని విలువతోపాటు జరిమానా కలిసి రూ.63 లక్షలు చెల్లించాలని సెప్టెంబర్ 13న యజ మానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. జరిమానా 15 రోజుల్లోగా చెల్లించాలని అదే నెల 28న డిమాండ్ నోటీసు కూడా పంపించారు. క్వారీ యజమాని ఇప్పటిదాకా జరిమా నా కట్టలేదు. పైగా, గ్రానైట్ రాయిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రి, పక్క రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి అండదండలుండడంతో పర్మిట్ల కోసం పైరవీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలు జరిగినప్పుడు క్వారీలను సీజ్ చేయడమో లేదా... పనులు నిలిపి వేయడమో చేయా లి. కానీ, అక్రమాలు జరిగినట్లు తేలినా... జరిమానా చెల్లించకుండా పర్మిట్లకోసం పైరవీలు చేస్తుండడం... క్వారీ వద్ద పనులు యథాతథంగా కొనసాతుండడంతో అధికారుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మొలంగూరు, లలితాపూర్‌లోని అక్రమం గా తవ్విన గ్రానైట్ రాయి విలువ వాస్తవానికి రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. హద్దులు అతిక్రమించి ఆక్రమణలకు పాల్పడ్డారని తేలినా... జరిమానా చెల్లించకుండా తప్పించుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకంజ వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్వారీలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే విషయమై మైనింగ్ ఏడీని వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా... ఆయన వివరాలు చెప్పకుండా ఫోన్ కట్ చేయడం గమనార్హం.
గ్రానైట్ ‘ఘనులు’
Published Sun, Nov 17 2013 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
Advertisement
Advertisement