నగదు రహిత వైద్యసేవలను అందించే ఉద్యోగుల వైద్య పథకం అమలుపై ప్రభుత్వం కాస్త సడలింపునిచ్చింది.
ఉద్యోగుల హెల్త్‌కార్డులు
పూర్తిగా అందని నేపథ్యంలో సడలింపు..
సాక్షి, హైదరాబాద్: నగదు రహిత వైద్యసేవలను అందించే ఉద్యోగుల వైద్య పథకం అమలుపై ప్రభుత్వం కాస్త సడలింపునిచ్చింది. హెల్త్‌కార్డులు అందరికీ అందకపోవడం, పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు చేయకుండా ఉండటం కారణంగా... గతంలో మాదిరిగా ముందు వైద్యానికి డబ్బు చెల్లించి, అనంతరం రీయింబర్స్ పొందే అవకాశాన్ని మార్చి 31 వరకూ కల్పించారు. ఈ మేరకు వైద్య విద్య డెరైక్టర్ కార్యాలయానికి ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హెల్త్‌కార్డులు పొందిన వారు నగదు రహిత వైద్య సేవలను పొందవచ్చునని పేర్కొన్నారు. అయితే, 2013 డిసెంబర్ 5లోగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు తాత్కాలిక హెల్త్‌కార్డులు పొందాలని, అలా పొందని వారికి రీయింబర్స్‌మెంట్ చేయడం కుదరదని అప్పట్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కానీ, ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు 70 లక్షల మంది ఉండగా... ఇప్పటివరకూ జారీ చేసింది 15 లక్షల హెల్త్‌కార్డులు మాత్రమే. దీంతో చాలా మంది ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. పైగా చాలా ఆస్పత్రులు నగదు రహిత సేవలకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మార్చి 31 వరకూ మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం కల్పించారు. మరోవైపు ఇప్పటికే... రీయింబర్స్‌మెంట్ కోసం వచ్చిన ఎనిమిదివేల దరఖాస్తులు వైద్య విద్య డెరైక్టరేట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. విభజన నేపథ్యంలో వాటిని త్వరితగతిన పరిష్కరించనున్నారు.