విజయనగరం మార్కెట్ కమిటీ కార్యాలయం
విజయనగరం రూరల్, న్యూస్‌లైన్: 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో తొమ్మిది మార్కెట్ కమిటీలకు లక్ష్యాన్ని మించి ఆదాయం లభించింది. జిల్లా లక్ష్యం 9.37 కోట్ల రూపాయలు కాగా, తొమ్మిది మార్కెట్ కమిటీల నుంచి రూ. 10 కోట్ల 21 లక్షల 86 వేల ఆదాయం సమకూరింది. అత్యధిక ఆధాయంతో పూసపాటిరేగ మార్కెట్ కమిటీ మొదటి స్థానంలో నిలిచింది. పూసపాటిరేగ మార్కెట్ కమిటీ లక్ష్యం 75 లక్షల రూపాయలు కాగా రూ.కోటి ఆరు లక్షల 48 వేల ఆదాయంతో లక్ష్యం సాధించింది.
రెండో స్థానం సాధించిన చీపురుపల్లి మార్కెట్ కమిటీ రూ.75 లక్షల లక్ష్యానికి గాను రూ.97.57 లక్షల ఆదాయం సాధించింది. బొబ్బిలి మార్కెట్ కమిటీ లక్ష్యం కోటీ 92 లక్షల రూపాయలు కాగా కోటి 89 లక్షల తొంబైమూడు వేల రూపాయలతో 99 శాతం ఆదాయాన్ని సాధించింది. కొత్తవలస మార్కెట్‌కమిటీ లక్ష్యం నల బై ఐదు లక్షల రూపాయలు కాగా 32 లక్షల తొమ్మిది వేల రూపాయలు, సాలూరు మార్కెట్ కమిటీ లక్ష్యం కోటి 25 లక్షల రూపాయలు కాగా కోటీ 54 లక్షల 37 వేల రూపాయల ఆదాయం సమకూరింది.
కురుపాం మార్కెట్ కమిటీకి రూ.28 లక్షలు లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.36 లక్షల 25 వేల ఆదాయం సమకూరింది. పార్వతీపురం మార్కెట్ కమిటీకి రూ.1.65 కోట్ల లక్ష్యం నిర్దేశించగా రూ.కోటి 97 లక్షల 32 వేల ఆదాయం సాధించింది. విజయనగరం మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.1.30 కోట్లు కాగా కోటీ 22 లక్షల 15 వేల రూపాయలతో 94 శాతం లక్ష్యాన్ని చేరుకుంది.
గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన గజపతినగరం ఏఎంసీ ఈ ఏడాది ఆఖరి స్థానంతో సరిపెట్టుకుంది. గజపతినగరం మార్కెట్ కమిటీ లక్ష్యం కోటీ రెండు లక్షల రూపాయలు కాగా 85 లక్షల 70 వేల రూపాయలతో 84 శాతం ఆదాయాన్ని సాధించింది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం మార్కెటింగ్‌శాఖకు తగలకపోవడంతో అధికారులు లక్ష్యాన్ని పూర్తి చేయగలిగారు.