సారొస్తారా..?
- మేడారానికి ముఖ్యమంత్రి వచ్చేనా...
- ఇంకా ఖరారు కాని కిరణ్ పర్యటన
- 2012లో వారం ముందే వచ్చిన సీఎం
- ఈ సారి సంప్రదాయం తప్పుతుందా...
సాక్షి ప్రతినిధి, వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా పేరుంది. పూర్తిగా గిరిజన సంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ మహాజాతరను 1996లో ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా... జాతర జరిగే రోజుల్లో లేదా అంతకు వారం ముందు మేడారానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం వనదేవతలకు మొక్కులు సమర్పించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రులు వచ్చి ఈ ప్రక్రియ పూర్తి చేయడం గత జాతర వరకు జరిగింది. కానీ... తాజా పరిస్థితుల నేపథ్యంలో మేడారం జాతరకు ఈ సారి ముఖ్యమంత్రి వచ్చే సూచనలు కనబడడం లేదు.
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటన ఇంకా ఖరారు కాకపోవడమే ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా యంత్రాంగానికి గానీ, పోలీసు శాఖకు గానీ ఎలాంటి సమాచారం లేదు. ఇవన్నీ చూస్తుంటే మేడారం జాతరకు కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతో రాజకీయ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చల సమయంలో ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు తెలంగాణవాదులను మనస్తాపానికి గురిచేసింది. అంతేకాదు... కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఇంకా పెరిగిందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మేడారం జాతరకు వచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు. ఇదే జరిగితే గిరిజన జాతరకు ముఖ్యమంత్రి వచ్చి మొక్కులు సమర్పించుకునే సంప్రదాయూనికి కిరణ్‌కుమార్‌రెడ్డి గండికొట్టినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రెండేళ్లకే మారిన నేతల పరిస్థితి
2012 ఫిబ్రవరి 8 నుంచి 11వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 1న మేడారానికి వచ్చారు. జాతర మొదలయ్యే వారం (మండె మెలిగే) రోజున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య, సమాచార శాఖ మంత్రి డీకే.అరుణ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు, కాంగ్రెస్ నేత కె.చిరంజీవితో కలిసి వచ్చి సమ్మక్క-సారలమ్మకు మొక్కులు సమర్పించుకున్నారు. జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, జిల్లాలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు. పొన్నాల లక్ష్మయ్య అయితే ఒకడుగు ముందుకేసి ముఖ్యమంత్రి విథేయుడిగా వ్యవహరించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ఎత్తు బంగారం(బెల్లం) తూకం సమయంలో ఏకంగా ఆయన కాలు పట్టుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొకాళ్లపై నిలబడి సీఎంతో ఫొటో దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. రెండేళ్లకే పరిస్థితి మారిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జాతర జరగనుంది. ప్రస్తుత జాతరకు సంబందించి కీలకమైన మండమెలిగె ప్రక్రియ బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమంతో జాతర మొదలవుతుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతరకు వస్తున్నారా... లేదా... అనేది మంత్రులకు సైతం తెలియని పరిస్థితి నెలకొంది.
హామీల మాటేమిటి...
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జాతరకు రావడం, రాకపోవడం ఎలా ఉన్నా... గత జాతర సమయంలో ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మేడారంలో రూ.2 కోట్లతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. మళ్లీ జాతర వచ్చినా మ్యూజియం ఊసే లేదు. సమ్మక్క దేవత ఉండే చిలకలగుట్ట చుట్టు కంచె(ఫెన్సింగ్) ఏర్పాటు చేస్తామని చెప్పగా... ఇది ఇటీవలే మొదలైంది. కోటి మంది భక్తులు వచ్చే మేడారం మహాజాతరను జాతీయ పండుగగా ప్రకటించే విషయాన్ని పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీల అమలు విషయంలో జిల్లా మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య సైతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుగానే వ్యవహరించారు. మళ్లీ జాతర వచ్చినా అప్పటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు.