మీడియా.. అతిపెద్ద మాఫియా: జేసీ ప్రభాకర్‌రెడ్డి
పుట్లూరు, న్యూస్‌లైన్: మీడియా.. అతి పెద్ద మాఫియా అని, పాలెం బస్సు దుర్ఘటనలో ఓ చానల్ రూ.7కోట్లు డిమాండ్ చేసిందని అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాక ర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన పుట్లూరులో విలేకరులతో మాట్లాడారు. డబ్బు డిమాండ్ చేసిన చానల్ పేరేంటని అడిగిన ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. ‘ఆటో ప్రమాదాలు జరిగితే డ్రైవర్‌కు డ్రైవింగ్ లెసైన్స్ ఉండదు.. ట్యాక్స్, ఇన్సూరెన్స్ అసలు కట్టి ఉండరు.. ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే.. వారి గురించి ఎవరూ పట్టించుకోరు.. మరి పాలెం దుర్ఘటననే ఎందుకు పట్టించుకుంటున్నారు’ అని ఆయన ప్రశ్నించారు.
ఈ రోజు జబ్బార్ జబ్బార్ అంటున్నారు.. తప్పు చేస్తే నిబంధనల ప్రకారం 304ఎ సెక్షన్ కింద అరెస్టయిన వెంటనే బెయిల్ వస్తుందని, ఇప్పుడలాగే వచ్చారని అన్నారు. 45 మంది బాధితులకు న్యాయం జరిగేట్టయితే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని పేర్కొన్నారు.