సేవలు ఎండమావులు!
Published Sat, Dec 28 2013 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
ఇన్ని విధాలుగా ముఖ్యమంత్రి నుంచి అందరూ గొప్పగా ఊదరగొడుతున్నా మీసేవలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి చాలా సేవలు సక్రమంగా అందుబాటులోకి రావడంలేదు. వీటి పట్ల ప్రజలకు కూడా సరైన అవగాహన కల్పించలేదు. ఒక వేళ ఈ కేంద్రాల్లో సేవలందించినా సేవకో రేటు చొప్పున అధికంగా దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 174 మీసేవ కేంద్రాలున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ కేంద్రాలలో చాలా వాటికి పనిలేకుండా పోయింది.
పార్వతీపురం, న్యూస్‌లైన్: ప్రభుత్వం నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రం కావాలన్నా మీ సేవా కేంద్రాల ద్వారా పొందాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో పుట్టగొడుగుల్లా మీ సేవా కేంద్రాలు పుట్టుకొచ్చాయి. కొంతమంది అధికారులు మీ సేవా కేంద్రాల నిర్వాహకుల నుంచి చేసుకున్న ఒప్పందం మేర చాలా చోట్ల అవసరం లేకున్నా మీ సేవా కేంద్రాలకు అనుమతులిచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల్లో ఎంతోకొంత సంబంధిత అధికారులకు ముట్టజెప్పాలన్న అంగీకారంతో చాలా చోట్ల మీ సేవా కేంద్రాల ఏర్పాట్లు జరిగాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు.. సరికదా దీనిపై సరైన అవగాహన లేక సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఓటర్లుగా నమోైదె నవారంతా ఓటరు గుర్తింపుకార్డులను మీ సేవా కేంద్రాల ద్వారా పొందాలని అధికారులు ఆదేశిస్తున్నారు. అయితే మీ సేవా కేంద్రాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందాలంటే భారత జాతీయ ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపుపొందిన నంబరుతో హోలోగ్రామ్స్(జాతీయ చిహ్నం) ఈ కేంద్రాలకు అందాల్సివుంది. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సంకేతాలు లేవు.
పతి పౌరునికి ఓటరు గుర్తింపుకార్డు అవసరమని ప్రభుత్వమే ప్రకటించింది. ప్రధానంగా చదువుకున్న యువతీయువకులకు ఈ ఓటరు గుర్తింపుకార్డు చాలా అవసరం. అయితే హోలోగ్రామ్ లేకపోవడం వల్ల ఓటు హక్కు ఉన్నవారికి ఓటరు గుర్తింపుకార్డు లభించడంలేదు. మీ సేవా కేంద్రాల నుంచి ఎలాంటి ధ్రువీకరణ పత్రం కావాలన్నా ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అధికంగా సంబంధిత నిర్వాహకులు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు మినహా మిగిలిన ఎలాంటి ధ్రువీకరణ పత్రం కావాలన్నా ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే రెట్టింపు రుసుం వసూలు చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
ఉదాహరణకు ఓటరు ఐడీకార్డు కావాలంటే మున్సిపల్ కార్యాలయంలో రూ. 10లు చెల్లిస్తే ఇచ్చేవారు. ఇదే బయట మీ సేవా కేంద్రాల్లో తీసుకోవాలంటే రూ. 25 నుంచి రూ. 40లు వరకు వసూలు చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరగలేని కొంతమంది మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఎంత అడిగితే అంతే చెల్లించి తమ పనులు చేయించుకుంటున్నారు. ఈ కేంద్రాల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు సరికదా వారి పనులను చక్కబె ట్టుకొనేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం పరిసర ప్రాంతంలో సుమారు 40 మీ సేవా కేంద్రాలు ఉన్నప్పటికీ ఏ ఒక్క కేంద్రం కూడా సరిగ్గా పనిచేయడం లేదు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్నారే తప్ప వారి పనులను సకాలంలో చేసుకోలేకపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి మీ సేవాకేంద్రాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇక నుంచి ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేదు. మీ సేవ ద్వారా సులభంగా పొందవచ్చు.
- ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి
మీ సేవా కేంద్రాల ద్వారా అక్టోబర్ నాటికి 220, డిసెంబర్ నాటికి 300 పైచిలుకు పౌరసేవలు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం.
- ఐటీ శాఖ మంత్రి పొన్నాల
ఓటర్ ఐడీ కార్డు ఇవ్వడం లేదు
నాకు ఓటరు జాబితాలో ఓటు హక్కు ఉంది. ఓటరు ఐడీ కోసం ఎన్నోసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగాను. మీ సేవకు వెళ్లమని అధికారులు చెబుతున్నారు. మీ సేవలో హోలోగ్రామంలేకపోవడం వల్ల ఓటరు ఐడీకార్డు రావడంలేదు.
-పూడు శ్రీనివాసరావు, నర్సిపురం
అవగాహన కల్పించాలి
మీ సేవా కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన పరచాల్సి ఉంది. దీనిపై అవగాహన లేకపోవడంవల్ల ప్రజలంతా ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు పడుతున్నారు.
- చీకటి సత్యనారాయణ ,
సంగంవలస
Advertisement