సర్వర్, సాంకేతిక ఇబ్బందులు
తొలిరోజున 400 మంది సద్వినియోగం
30 వేల లోపు ర్యాంకర్లకు నేడు
విజయనగరం అర్బన్: సాంకేతిక సమస్యల కారణంగా ఇంజినీరింగ్ కళాశాలల ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలన ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నిర్వాహకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇక్కట్లకు గురయ్యారు. బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ సేవల అంతరాయం వల్ల స్థానిక పాలిటెక్నికల్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం ప్రారంభమైన ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ దాదాపు మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత అన్ని జిల్లాలను కలిపే సర్వర్ పనిచేయకపోడం, తరువాత బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బాండ్ పని చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడింది. పది రోజుల పాటు ర్యాంకుల వారీగా చేట్టే ఈ షెడ్యూల్‌కు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులూ లేకుండా చూడాలని బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు... కౌన్సెలింగ్ నిర్వాహకులు ముందుగా సమాచారం ఇచ్చారు. అయితే దాన్ని పట్టించుకోకపోవడం వల్ల తొలిరోజు మొదటి రౌండులో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో దూర ప్రాంతాలైన పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి అభ్యర్థులు అవస్థలు పడ్డారు.
తొలిరోజున 400 మంది సద్వినియోగం
షెడ్యూల్ మేరకు ఎంసెట్ ర్యాంక్‌లలో ఒకటి నుంచి 15 వేల వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారం చేపట్టారు. సాయంత్రం 5.00 గంటల సమయం ముగిసే సరికి 400 మంది అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని కౌన్సెలింగ్ కేంద్ర కో-కన్వీనర్ ఆర్.భాస్కరరావు తెలిపారు.
ధ్రువీకరణ పత్రాల తనిఖీ అనంతరం అభ్యర్థులకు ఇచ్చిన తేదీలలో ఎక్కడైనా నెట్ సెంటర్లోగానీ, కౌన్సెలింగ్ సెంటర్లో ఉన్న హెల్ప్ లైన్ కేంద్రంలోగానీ కాలేజీల వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చని చెప్పారు. ఎంసెట్ వెబ్‌సైట్‌లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకొంటే సంబంధిత టెలిఫోన్‌కు రహస్య నంబర్ (ఓటీఎస్) వస్తుందని, దానిని పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తే వెబ్ ఆప్షన్ పోర్టర్ వస్తుందని తెలిపారు.
30 వేల లోపు ర్యాంకర్లకు నేడు
షెడ్యూల్ ప్రకారం 15 వేల నుంచి 30 వేల ర్యాంక్‌ల వరకు శనివారం ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపడతామని తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణపత్రాలతోపాటు ఆధార్‌కార్డు జిరాక్స్ విధిగా తీసుకురావాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్‌లను తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు.
3 గంటల ఆలస్యంగా సరిఫికెట్ల పరిశీలన
Published Fri, Jun 12 2015 11:37 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM
Advertisement