సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాన్ని నివారించడం, నేత కార్మికుల ఆత్మహత్యలను అరికట్టే చర్యల్లో భాగంగా ఇక్కడ మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కృషిచేస్తానని కేంద్ర చేనేత జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి కావూరి
సిరిసిల్ల, న్యూస్‌లైన్: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో సంక్షోభాన్ని నివారించడం, నేత కార్మికుల ఆత్మహత్యలను అరికట్టే చర్యల్లో భాగంగా ఇక్కడ మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు కృషిచేస్తానని కేంద్ర చేనేత జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మరమగ్గాల ఆధునికీకరణ పథకాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్‌లోనే సైజింగ్, ప్రాసెసింగ్ యూనిట్, వార్పిన్, సీఎఫ్‌సీ(కామన్ పెసిలిటీ సెంటర్)ను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో మరమగ్గాల ఆధునికీకరణకు రూ.90 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే కార్పస్‌ఫండ్ 1.65 కోట్లు విడుదల చేయాలని కేంద్ర చేనేత జౌళిశాఖ కార్యదర్శిని ఆదేశించారు. కార్మికులకు ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని, వృత్తినైపుణ్యం పెంపొందించడం కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తామన్నారు.
ఆధునిక మగ్గాలను ఏర్పాటు చేసుకునేందుకు రూ.50లక్షల వరకు రుణం అందిస్తామన్నారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలను ఈనెల 31లోపు మాఫీ చేస్తామని తెలిపారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటుకోసం రానున్న బడ్జెట్‌లో ఆర్థిక మంత్రికి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు, అధికారులు పాల్గొన్నారు.